వెండితెరపై కథానాయికగా ఒక అవకాశాన్ని సంపాదించుకోవడం ఒక ఎత్తయితే, తమ అందచందాలతో ..అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకోవడం మరో ఎత్తు. ఇక అందం .. అభినయం రెండూ ఉన్నప్పటికీ అవకాశాలు రావడం ఒక ఎత్తయితే, అదృష్టం కలిసొచ్చి విజయాలు దక్కడం మరో ఎత్తు. అందుకే అంటారు సినిమా తీయడమన్నా .. సినిమాల్లో నిలదొక్కుకోవాలన్నా, సినిమా చూడటమంత తేలిక కాదని. అంతటి కష్టతరమైన ఈ ఫీల్డులో కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ అడుగుపెట్టింది.
ఏదో ఒక సినిమాలో తొలి అవకాశం రావడం వేరు .. స్టార్ డైరెక్టర్ సినిమాలో చోటు దొరకడం వేరు. అలాంటిది అనుపమ పరమేశ్వరన్ ఏకంగా త్రివిక్రమ్ సినిమా ‘అ ఆ’తోనే ఎంట్రీ ఇచ్చేసింది. అంతేకాదు మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. విజయం పైనే అందరి దృష్టి ఉంటుంది కనుక, అనుపమను వెతుక్కుంటూ అవకాశాలు వచ్చేశాయి. యువకథానాయకుల జోడీగా ఆమె యూత్ ను బాగానే ఆకట్టుకుంది. కలువపూల కళ్లతో పడుచు మనసుల్లో పాగా వేసేసింది. నాని .. శర్వానంద్ .. రామ్ తో కలిసి తెరపై ఆమె చేసిన అల్లరికి మంచి మార్కులు పడిపోయాయి.
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ .. తెలుగులో ’18 పేజెస్’ చేస్తోంది. నిఖిల్ జోడీగా ఆమె చేస్తున్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉంది. ఈ సినిమాలో తన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందనీ, అందువల్లనే వెంటనే అంగీకరించానని అనుపమ చెప్పింది. అంతేకాదు .. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొత్తగా వస్తున్న కథానాయికల పోటీని తట్టుకుని నిలబడటానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అనుపమకు, ‘ది లియో న్యూస్’ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది.
Must Read ;-క్రేజీ అనుపమ ఐ లవ్ యూ అనుపమ అంటున్నారు!