దండగ మారి కౌన్సిల్ వద్దే వద్దని అసెంబ్లీలో చిందులు తొక్కిన పెద్దమనిషి సియం జగన్ రెడ్డి ఇప్పుడు ఏమొహం పెట్టుకొని కౌన్సిల్ లో ఎమ్మెల్సీ పదవులకు తమ నాయకులను ఎంపిక చేస్తున్నారు? ఆనాడు మూడు రాజధానుల బిల్లు శాసన మండలిలో నెగ్గలేదని వీరావేశంతో వీరంగాలు వేసి కౌన్సిల్ ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సీఎం జగన్ రెడ్డి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అభ్యర్థులను నిలబెట్టి వారికి ఓట్లు వెయ్యమని అడుగుతున్నారు?
మీకు పదవులు అవసరం అయినప్పుడు మాత్రం మండలి ముద్దా? మండలి లో మీ మాట నెగ్గనప్పుడు మండలి రద్దా? ప్రజాస్వామ్య బద్దంగా అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ఒక నియంత,ఒక రాజులాగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నజగన్ రెడ్డి పరి పాలన కంటే ఆనాటి మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలన ఎంతో మేలని ప్రజలే అంటున్నారు. ఏ రాచరిక పాలనలోనూ ఇంతటి అధ్వాన్న మైన,అరాచక పాలన లేదనిపిస్తుంది. శాసనమండలి శుద్ధ దండగ అని అభినయాలు ప్రదర్శించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు ఆదే శాసనమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులను కల్పించి తానేదో సామాజిక న్యాయాన్ని పాటించినట్లు ఉదర గొట్టుకొంటున్నారు. స్వార్ధమే పరమార్ధంగా జగన్ రెడ్డి ప్రదరిస్తున్నవికార విన్యాసాలు ప్రజాస్వామ్య నవనాడులను కుంగ దీస్తున్నాయి. ఆనాడు తన మాట నెగ్గలేదన్న అక్కసుతోనే శాసన మండలికి మరణశాసనం విధిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన వారు తర్వాత ఎందుకు రద్దు చెయ్యమని కేంద్రం పై ఎందుకు వత్తిడి చెయ్యలేదు?
మాట తప్పని,మడిమ తిప్పని వంశం అని,విశ్వసనీయత అన్న పదం నా తోనే పుట్టిందని బీరాలు పలికిన జగన్ ఈ నాలుగేళ్లలో ఎన్ని సార్లు మాటలు మార్చారో జగన్ కి వున్న విశ్వసనీయత ఏ పాటిదో కౌన్సిల్ రద్దు చెయ్యకుండా కొనసాగించడమే అని చెప్పాలి. ఆరోజు అమరావతికి భూములిచ్చిన రైతులకు స్పష్టమైన పరిష్కారం చూపకుండా మూడు రాజధానులు అంటూ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) చట్ట ఉపసంహరణ బిల్లులను చట్ట సభల్లో ప్రవేశ పెట్టింది జగన్ ప్రభుత్వం. అసెంబ్లీ లో తమ పార్టీకి బలం ఉండటంతో బిల్లులను ఆమోదించుకున్నారు. కానీ శానన మండలిలో తమకు బలం లేక పోయినా కూడా తాము చెప్పింది జరిగి తీరాల్సిందేనన్న పట్టుదలతో బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ పరిస్థితుల్లో రెండు బిల్లులను మరింత అధ్యయనం చేయడం కోసం,ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసం శాసన మండలి ఛైర్మన్ ఎమ్ ఏ షరీఫ్ తనకున్న విచక్షణాధికారాన్ని ఉపయోగించి సెలెక్టు కమిటీకి పంపాలని నిర్ణయించడంతో తన అధికార గర్వానికి భంగం కలిగినట్లు భావించిన జగన్ రెడ్డి మండలికే మంగళం పాడతానని ఉవ్వెత్తున ఎగిసి పడ్డారు.
ప్రతిపక్షం తెలుగుదేశం, కౌన్సిల్‌లో తమకు ఉన్న సంఖ్యాబలంతో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులను అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ జగన్ రెడ్డి నానా యాగీ చేసారు. మండలిలో తమకు మెజార్టీ లేదు కనుక, తామనుకున్నది జరగలేదు కనుక అసలు మండలిలో ప్రజాస్వామ్యం లేదని చిందులు వేశారు. మీకు పదవులు అవసరం అయినప్పుడు మండలికి ప్రాణం పోయడం,మండలిలో మీ మాట నెగ్గలేదని మండలి ప్రాణం తీయడం ప్రజాస్వామ్యమా? తమకు మెజార్టీ ఉన్న సభలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్నట్లు ,తమకు బలం లేని చోట ప్రజాస్వామ్యం పరిఢవిల్లడం లేదని ప్రజాస్వామ్యంపై పెడబొబ్బలు పెట్టిన వారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్నికూనీ చేస్తూ జగన్ రెడ్డి సాగిస్తున్న కిరాతక పాలనకు ఎం సమాధానం చెబుతారు? హిట్లర్ కూడా ఒక వర్గంపై ఇంతటి అరాచకం, దమన కాండ చెయ్యలేదు.
శాసనవ్యవస్థలో ప్రాధాన్యత వున్నపెద్దల సభ నిర్ణయాన్ని శాసనసభలో తూర్పార పట్టి కించపరిచారు.పెద్దల సభ లో జరిగిన చర్చ ను శాసనసభలో హేళన చెయ్యడం చరిత్రలో లేదు.?ఆంధ్రప్రదేశ్ లాంటి పేద రాష్ట్రానికి ప్రతి ఏటా రూ 60 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి శాసనమండలిని నడిపించడం అవసరమాఅని దీర్గాలు తీశారు సియం జగన్ ఆరోజు, మరి అది నిజమైతే కౌన్సిల్ రద్దు చేయ్యకుండా తమ నాయకులను ఎమ్మెల్సీలుగా ఎందుకు నియమించారు? అభ్యర్థులుగా నిలబెట్టిన వారికి ఓట్లు వెయ్యమని ఎందుకు అడుగుతున్నారు? అంతే కాదు కిరాతక పాలనకు నాయకత్వం వహిస్తున్న జగన్ రెడ్డి నిజ స్వరూపం రోజు, రోజుకు వికృత రూపం దాలుస్తుంది. ప్రజా సమస్యల పై ఆందోళనలు చేసే వారి పై తప్పుడు కేసులు పెట్టడం,పోలీసు బలగాలతో అణచివేయడం, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడం,జగన్ పాలనలో నెపోటిజం,ఫెవరిటిజం తప్ప మరేమిలేదు.
ఈ రెండు ఐపిసి లో చెప్పబడిన అవినీతి కిందకే వస్తాయి.గంతంలో అమెరికా రాజ్యాoగానికి విరుద్దంగా ట్రంప్ వ్యవహరించినట్లే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా భారత రాజ్యాoగానికి విరుద్దంగా పరిపాలన సాగిస్తున్నారు. తమ నిర్ణయాలను వ్యతిరేకించినా,ప్రశ్నించిన ప్రతిపక్షాలను,వ్యవస్థలను,వ్యక్తులను చిదిమేసేందుకు వెనకాడని దుష్ట సంస్కృతి నెలకొన్నది జగన్ పాలనలో.నిరంకుశానికి,నియంతృత్వానికి,సంకుచిత రాజకీయానికి,అవకాశవాదానికి నిలయంగా మారింది జగన్ రెడ్డి పాలన.ప్రజా ప్రయోజనాల కన్నా,తమ రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.తాము అనుకొన్నవిధంగా కౌన్సిల్ లో బిల్లులు ఆమోదం పొందలేదని కౌన్సిల్ రద్దు చెయ్యాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపారు.
కోవిడ్ కారణంగా స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేసినందుకు ఎన్నికల సంఘాన్ని రద్దు చెయ్యాలని సమాలోచనలు చేశారు. జగన్ రెడ్డి పాలనలో మున్నెన్నడూ ఎరుగని విచిత్ర విన్యాసాలు నిర్లజ్జగా సాగుతున్నాయి.జగన్ మూర్తీ భావించిన అహంభావి.తనను ప్రశ్నించే వారిని సహించే సంస్కారం ఆయనలో లేదు. అడుగడుగునా ఎదురవుతున్న ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాదానం చెప్పలేని దయనీయ పరిస్థితి ఎదురుకావడంతో నిష్కారణంగా దాడిచేయించడం జగన్ వ్యవహార శైలి.విమర్శలను ఎదుర్కొనే లక్షణం ఏ నియంతకు ఉండదు. ఏది ఏమైనా దండగ మారి కౌన్సిల్ వద్దే వద్దని అసెంబ్లీలో చిందులు తొక్కిన పెద్దమనిషి సియం జగన్ రెడ్డి ఇప్పుడు ఏమొహం పెట్టుకొని కౌన్సిల్ లో ఎమ్మెల్సీ పదవులకు తమ నాయకులను ఎంపిక చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ?మీకు పదవులు అవసరం అయినప్పుడు కౌన్సిల్ ముద్దు, కౌన్సిల్ లో మీ మాటనెగ్గక పొతే రద్దు చేస్తారా?