‘రా’ కంటెంట్ తో తెరకెక్కి సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్-1’. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్నీ భాషలలో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. దేశ వ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, నటి రవీనా టాండన్, టాలీవుడ్ నటుడు రావు రమేష్ లు చాప్టర్-2 లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు 80 శాతం పూర్తి చేసుకుంది. మిగిలిన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసి ఈ సినిమాను అక్టోబర్ 23న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.
‘చాప్టర్-2’ అనుకున్న సమయానికి కంటే ఆలస్యం కానుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. రాఖీ భాయ్ ను ఢీకొట్టే ప్రతినాయకుడుగా అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదల చేసిన సంజూ బాబా లుక్ పాజిటివ్ రెస్పాన్స్ పట్టేసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ ఫస్ట్ లుక్ ను చూస్తుంటే అధీరా పాత్ర చాలా కీలకమనే విషయం అర్ధమవుతోంది. సంజయ్ దత్ పై ప్రధాన సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ప్రస్తుతం సంజయ్ కు కేన్సర్ నిర్దారణ కావడంతో ఆయన మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లానున్నారు. మెడికల్ ట్రీట్మెంట్ కోసం షూటింగ్ లకు విరామం ఇస్తున్నట్లు సంజయ్ ప్రకటించడంతో ‘చాప్టర్-2’ విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కావడం ఖాయమనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి…!