నేటి సీమ టపాకాయ ఎవరంటే సితార అంటూ ఠక్కున చెప్పేయొచ్చు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ చిన్నారి హైపర్ యాక్టివ్.. సోషల్ మీడియాలో అంతకన్నా యాక్టివ్. సితార ఫొటో ఎక్కడ కనిపించినా ఆమె మహేష్ గారాల పట్టి అని జనం ఇట్టే పసిగట్టేస్తారు. మహేష్ కూడా సితార కోసం, గౌతమ్ కోసం తన సమయాన్ని ఎంతో కేటాయిస్తుంటాడు. షూటింగులు లేకపోతే వారితో కలిసి ఎంజాయ్ చేయడం ఆయన హాబీ. ఈ మధ్య సకుటుంబ సమేతంగా దుబాయ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కూడా.
తాజాగా ఈ కుటుంబమంతా అక్కడ ఓ రెస్టారెంట్ కు వెళ్లినట్టున్నారు. గౌతమ్, సితారలతో కలిసి డిన్నర్ చేస్తున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. ‘మా గ్యాంగ్ తో డిన్నర్’ అంటూ మహేష్ కామెంట్ కూడా చేశారు. ఈ ఫొటోని నమ్రత తీసినట్టున్నారు. ఇక్కడ కూడా సితార యాక్టివ్ నెస్ ఏ మాత్రమూ తగ్గలేదు. పెద్దయితే సితార ఎలాంటి తారగా మారుతుందో అర్థం కావడం లేదు.
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె కూడా మొదట్లో ఓ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. అయితే అభిమానులు ఇష్టపడలేదు. ఆ తర్వాత నటిగా, నిర్మాతగా ఆమె కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇక సితార విషయానికి వస్తే ఆమె తల్లి నమ్రత కూడా ఒకప్పుడు హీరోయినే. అందుకే కాబోలు సితారకు ఇప్పటి నుంచే డ్యాన్స్ ల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్టున్నారు. మరి ఈ గ్యాంగ్ లీడర్ పిల్లలిద్దరూ వెండి తెరపై మున్ముందు ఎలాంటి సందడి చేస్తారో చూడాల్సిందే.