అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు కల. ఇందులో భాగంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగానే అమరావతిలో పనులు జరుగుతున్నాయి. ఈ విజన్‌లో అత్యంత కీలకమైన అంశాలలో ఒకటి అండర్‌గ్రౌండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ . సాధారణంగా ఇండియాలోని ఇతర నగరాలు, పట్టణాల్లో కనిపించే విద్యుత్ స్తంభాలు, గాలిలో వేలాడే తీగలు అమరావతిలో ఉండవు. పవర్ కేబుల్స్ అన్నీ భూమి లోపల ఏర్పాటు చేయడం వల్ల నగరానికి ఒక విశాలమైన, సుందరమైన రూపు వస్తుందని, ప్రకృతి విపత్తులైన తుఫానులు, భారీ వర్షాల సమయంలో కూడా విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుంది.
అండర్ గ్రౌండ్ పవర్ ఇన్‌ఫ్రాపై లోకేష్ తాజాగా అప్డేట్ ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచస్థాయి అండర్‌గ్రౌండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. అండర్‌గ్రౌండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వేగంగా రూపుదిద్దుకుంటోందన్నారు. భూగర్భంలో హైటెన్షన్ లైన్లు వేయడం ద్వారా భద్రత పెరుగుతుందని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమరావతిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. అత్యాధునిక మౌలిక వసతుల నగరంగా అమరావతి ఎదుగుతోందన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి రూపుదిద్దుకుంటోందని లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
అండర్‌గ్రౌండ్ పవర్ నెట్‌వర్క్‌ను నిర్మించడం అంత సులువైన పని కాదు. ఇదో ఇంజినీరింగ్ సవాల్. అంతేకాదు భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టు. ఐనప్పటికీ అమరావతిలోని కీలక ప్రాంతాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. భూమిని తవ్వి, కేబుల్స్ వేసి, వాటిని మళ్లీ కప్పివేయడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ, సామగ్రి అవసరం. ఈ ప్రక్రియ పూర్తయితే, మరమ్మతులు లేదా కొత్త కనెక్షన్ల సమయంలో రోడ్లను తవ్వాల్సిన పని లేకుండా, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వీస్ టన్నెల్స్ ద్వారా పనులను పర్యవేక్షిస్తారు. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా, అత్యున్నత జీవన ప్రమాణాలు గల నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యానికి అండర్‌గ్రౌండ్ పవర్ నెట్‌వర్క్ ప్రధాన ఉదాహరణ











