“వ్యూహం” సినిమాను పూర్తిగా పొలిటికల్ కథతో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఇది పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ వై.ఎస్.ఆర్.సి.పి.వారికి, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు, వాటి అధినాయకులకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు వారి పాత్రలకు పోలికలు దగ్గరగా ఉన్న డూప్ లను పెట్టి వ్యంగంగా చిత్రీకరించారని ఇప్పటికే ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సెన్సార్ అధికారులకు, అలాగే ఎలక్షన్ కమీషన్ అధికారులకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను సెన్సార్ చేసేందుకు హైదరాబాద్ లోని సెన్సార్ రీజినల్ బోర్డు నిరాకరించి, రీవైజ్ సెన్సార్ కమిటీకి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో రీవైజ్ సెన్సార్ కమిటీలో ఉన్న ప్రముఖ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ ను ఈ సినిమా వరకు సెన్సార్ చేయకుండా తప్పించాలని నట్టి కుమార్ సెన్సార్ చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు తెలంగాణ హైకోర్టులో కేసు కూడా వేశారు. జీవిత రాజశేఖర్ ఓ పొలిటికల్ లీడర్ అని, ఆమె గతంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, ప్రస్తుతం బి.జె.పి.నాయకురాలిగా ఉన్నారని, ఆమె వ్యూహం సినిమాను ఆర్.సి. కమిటీలో కొనసాగి, సెన్సార్ చేసినట్లయితే, న్యాయం జరగదని నట్టి కుమార్ హైకోర్టులో వేసిన కేసులో పేర్కొన్నారు. ఆమెపై సహజంగానే వత్తిడులు వచ్చే అవకాశం ఉందని, అందుకే సెన్సార్ చైర్మన్ జోక్యం చేసుకుని, చెన్నై లేదా ముంబై, కర్ణాటక వంటి రాష్ట్రాల సెన్సార్ ఆర్.సి. సభ్యలను ఇక్కడి కమిటీలో వేసి, వారి చేత సెన్సార్ చేయించాలని నట్టి కుమార్ తాను వేసిన కేసులో వివరించారు. ఈ కేసులో సెన్సార్ వారితో పాటు ఎలక్షన్ కమీషన్ వారిని కూడా పార్టీ చేయడం జరిగింది.
ఈ కేసు తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణకు వచ్చింది. నట్టి కుమార్ తరపున అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ విషయాలను కేశాపురం సుధాకర్ కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. మరిన్ని వివరాలను సమర్పించడం కోసం అనంతరం వారం రోజులపాటు ఈ కేసును హైకోర్టు వాయిదా వేసింది..ఈ వాజ్యంలో సెన్సార్ తరపున, ఎలక్షన్ కమీషన్ తరపున న్యాయవాదులు కూడా పాల్గొన్నారు