చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు మధ్య విడదీయరాని బంధం ఉంది. యావత్ భారతదేశంలో ఎంతోమంది సినీ ప్రముఖులు రాజకీయాల్లో సత్తా చాటారు. అయితే.. దక్షిణాదిన ఈ ధోరణి మరింత ఎక్కువ. కరుణానిధి, ఎమ్.జి.ఆర్, యన్టీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు ముఖ్యమంత్రులుగానూ పనిచేసిన ఘనత సౌత్ సినీ ఇండస్ట్రీ సొంతం. అందుకే.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. సినిమాలకు సంబంధించిన ఎవరెవరు పాలిటిక్స్ లోకి దూకబోతున్నారు. ఏ రాజకీయ పార్టీలను స్థాపించబోతున్నారు? అనే చర్చ సాగుతూనే ఉంటుంది.
వచ్చే యేడాది తమిళనాట ఎన్నికల నగారా మోగబోతుంది. ఇప్పటికే కమల్ హాసన్ సొంత పార్టీ స్థాపించాడు. రజనీకాంత్ కూడా అదే బాటలో ఉన్నాడు. ఇంకా.. విజయ్ కాంత్, శరత్ కుమార్ వంటి నటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కొత్తగా దూకబోయే నటులెవరనే దానిపైనే ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ సాగుతుంది. తమిళనాట రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ ని సైతం దాటి ఇప్పుడు నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీపై హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక.. కోలీవుడ్ లో విజయ్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతుంటే.. టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ మరోసారి తెరపైకి వచ్చింది.
ముమ్మూర్తులా తాత నందమూరి తారక రామరావు పోలికలతో ఉండే జూనియర్ సినిమాల్లోనే కాదు.. పొలిటికల్ స్పీచ్ ల్లోనూ అదరగొట్టాడు. 2009 సాధారణ ఎన్నికల్లో తారక్ వాగ్దాటికి కాకలు తీరిన రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే చాలు.. అక్కడ జనం తండోపతండాలుగా పోగయ్యేవారు. అంతకుముందు పొలిటికల్ స్పీచ్ లు ఇచ్చిన ఎక్స్ పీరియెన్స్ లేకపోయినా.. గంటల తరబడి ధారాళంగా రాజకీయ ఉపన్యాసాలు, అపొజిషన్స్ పై పవర్ పంచెస్ కురిపించాడు తారక్. అయితే.. అనూహ్యంగా ఆ ఎన్నికల్లో టి.డి.పి. ఓడిపోవడం.. ఆ తర్వాత కుటుంబ కలహాలు.. ఎన్టీఆర్ ని సినిమాలకే పరిమితం చేశాయి.
అయితే.. 2024 ఎన్నికల టార్గెట్ గా జూనియర్ మళ్లీ పావులు కదుపుతున్నాడట. టి.డి.పి. కి మునుముందు దిశా నిర్దేశం చేసే నాయకుడు ఎన్టీఆర్ ఒక్కడే అని అభిమానులు నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే.. బుల్లి రామయ్య ఈమధ్య అభిమాన సంఘాలను సంఘటితం చేస్తున్నాడట. ఇన్ డైరెక్ట్ గా ఇప్పటికే ఫ్యాన్ క్లబ్స్ అన్నింటికీ సమాచారం అందించినట్టు ఫిల్మ్ సర్కిల్స్, పొలిటికల్ అరెనా లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’.. ఆ తర్వాత త్రివిక్రమ్.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్.. ఇలా క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టిన ఎన్టీఆర్.. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే న్యూస్ నందమూరి ఫ్యాన్ సర్కిల్స్ లో స్ప్రెడ్ అవుతుంది.
అయితే.. బడా బడా స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ అన్ని వేళలా సక్సెస్ అవ్వలేదు. తెలుగులో యన్టీఆర్ సాధించింది.. కృష్ణ, చిరంజీవి, పవన్ వంటి స్టార్స్ వల్ల కాలేదు. తమిళంలో ఎమ్.జి.ఆర్, జయలలిత పొందింది విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ సాధించలేకపోయారు. మరి.. అన్ని ఆటుపోట్లు ఎదుర్కొని.. యంగ్ టైగర్ పొలిటికల్ స్టార్ గానూ మారతాడేమో చూడాలి.