లాక్ డౌన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మిగతా భాషలతో పోల్చుకుంటే… టాలీవుడ్ లో ఓటీటీ సినిమాల రిలీజ్ లు తక్కువే. హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కాస్తంత పేరున్న సినిమాలు విడుదలయ్యాయి కానీ.. టాలీవుడ్ నిర్మాతలు మాత్రం వీటిమీద అంతగా ఫోకస్ పెట్టలేదు. రెండు మూడు నెలల్లో థియేటర్స్ తెరుచుకుంటాయనే ఉద్దేశంతోనే ఓటీటీలో విడుదల చేయాలనే థాట్ వారికి రాలేదని చెప్పాలి. అయినా సరే.. మధ్యలో కృష్ణా అండ్ హిజ్ లీల, భానుమతి రామకృష్ణ, ఉమామహేశ్వరా ఉగ్రరూపస్య, జోహార్ లాంటి స్ట్రైట్ మూవీస్ … జిప్సీ, 36 వయసులో , ఫోరెన్సిక్, అండ్ ది ఆస్కార్ గోస్ టు, బంగారు తల్లి, మగువలు మాత్రమే లాంటి పరభాషల డబ్బింగ్ సినిమాలు ఓటీటీలో సందడి చేశాయి.
అయితే మంచి రేంజ్ ఉన్న సినిమాలు, క్రేజీ మూవీస్ మాత్రం ఓటీటీల కేసి తొంగిచూడలేదు. అయితే 6 నెలలైనా థియేటర్స్ తెరుచుకోకపోవడంతో .. టాలీవుడ్ లోని కొందరు నిర్మాతల ఆలోచనలు మారిపోయాయి. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ లో నానీ, సుదీర్ బాబు నటించిన ‘వి’ సినిమా రిలీజ్ అయింది. దాని రిజల్ట్ ఆశించిన రీతిలో రాకపోవడంతో… కొన్ని రోజుల పాటు ఓటీటీలో మిగతా సినిమాల విడుదల విషయంలో ఎలాంటి అప్టేట్స్ రాలేదు. దీంతో ప్రేక్షకుల్లో కాస్తంత నిరాశ కనిపించింది. కానీ ఉన్నట్టుండి టాలీవుడ్ లో మళ్ళీ సందడి కనిపిస్తోంది.
వరుసగా కొత్త సినిమాల్ని ఓటీటీల్లో విడుదల చేయడానికి కొందరు నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఇప్పటికే అక్టోబర్ 2న ఆహా ఓటీటీలో రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా విడుదల కానున్నట్టు ప్రకటించారు. అలాగే అదే ఓటీటీలో కమెడియన్ సుహాస్ నటించిన ‘కలర్ ఫోటో’ సైతం విడుదల కాబోతోంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్బోబర్ 23న విడుదల చేయబోతున్నారు. ఇక అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాను కూడా అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఒకేనెల్లో మూడు తెలుగు సినిమాలు విడుదల కానుండడం.. అందులోనూ ఒకేరోజు రెండు విడుదలవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ‘సోలో బతుకే సో బెటర్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, దటీజ్ మహాలక్ష్మి’ లాంటి సినిమాల్నీ కూడా వరుసగా ఓటీటీల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నీ అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా విడుదల అవడానికి అవకాశాలున్నాయి. మొత్తం మీద థియేటర్స్ లో సినిమాలు చూడలేకపోతున్నాము అనే పీలింగ్ లో ఉన్న ప్రేక్షకులకు వచ్చే రెండు నెలల్లో వరుసగా ఓటీటీ ఫీస్ట్ గ్రాండ్ గా ఉండేలా కనిపిస్తోంది. అయితే అక్టోబర్ నెల్లో థియేటర్స్ తెరిచే అవకాశాలున్నాయనే వార్తలొస్తున్న నేపథ్యంలో .. వీటి ఒటీటీ విడుదల విషయంలో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయేమో తెలియదు కానీ… ‘వి’ సినిమా నుంచి స్తబ్దత ఏర్పడిన ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ సినిమాలు తిరిగి కొత్త కళను తీసుకొస్తాయేమో చూడాలి.











