విశాఖ నుండి రాయ్ పూర్ మధ్య నూతనంగా నిర్మించేందుకు ప్రతిపాదించిన జాతీయరహదారిపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ విషయంపై సంబంధిత అధికారులు ప్రజాభిప్రాయం సేకరించారు.
వేలాది ఎకరాల సాగుభూమి నాశనం
ఉన్నదాన్ని బాగు చేసుకోకుండా.. కొత్త దానికోసం వెంపర్లాడడం మంచిది కాదని పలువురు రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశాఖపట్నం – రాయ్ పూర్ మధ్య ఉన్న జాతీయ రహదారి (ఎన్ హెచ్ – 26) అధ్వానంగా తయారై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని , దాని మరమ్మతులు , నిర్వహణ మెరుగుపరిస్తే సరిపోతుందని , కొత్తది అవసరముండదని చాలా మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. నూతన ప్రతిపాదిత జాతీయరహదారి నిర్మాణం వల్ల విజయనగరం జిల్లాలోని తాటిపూడి, ఆండ్ర , పెద్దగెడ్డ రిజర్వాయర్ల పరిధిలోని వేలాది ఎకరాల సాగుభూములు పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అభివృద్ధికి ఊతం
విశాఖ – రాయపూర్ మధ్య నూతన ప్రతిపాదిత జాతీయరహదారి వల్ల జిల్లాలోని సుమారు 100కిలోమీటర్ల మేర తొమ్మిది మండలాల్లోని 38 పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని , దాంతో జిల్లా ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని , దీని నిర్మాణం ఎంతైనా అవసరమని ప్రగతికాముకులు అభిప్రాయపడ్డారు.
జిల్లాలో నూతన జాతీయ రహదారి స్వరూపం
దేశ ఆర్థికాభివృద్ది కోసం, వివిధ ప్రాంతాలమధ్య రహదారి సౌకర్యాలను పెంచేందుకు గానూ, భారత్ మాలా పరియోజన కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో, రాయ్‌పూర్-విశాఖపట్నం మధ్య కొత్తగా 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేని కేంద్రప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం సంతపాలెం వద్ద ప్రారంభమై, పాచిపెంట మండలం ఆలూరు వరకు ఉంటుంది.
జిల్లాలో సుమారు 94.297 కిలోమీటర్ల మేర నిర్మితమయ్యే ఈ రహదారి 51 గ్రామాలు, 38పంచాయితీలు, 9 మండలాల గుండా సాగుతుంది. జిల్లాలో ఈ రహదారి కోసం సుమారుగా 642.99 హెక్టార్ల మేర భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రతిపాదిత ప్రదేశంలో 165.911 హెక్టార్ల ప్రభుత్వ భూమి, 432.04 హెక్టార్ల ప్రయివేటు భూములు, 45.04 హెక్టార్ల అటవీభూమి ఉంది.
ఈ జాతీయ రహదారిలో భాగంగా 17 ప్రధాన వంతెనలు, 30 చిన్న వంతెనలు, 25 ఆర్ఓబిలు, 13 రైల్వే అండర్ పాస్‌లు, మరో 14 తేలికపాటి అండర్ పాస్‌లు, 20 కల్వర్టులను నిర్మించాల్సి ఉంది. గంటకి సుమారు 100 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించే విధంగా ఈ రహదారి నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.2,547కోట్లు ఖర్చు అవుతుందని ప్రాధమికంగా అంచనాలు రూపొందించారు. దీనిలో సుమారు రూ.220 కోట్లు భూసేకరణ, పునరావాసానికి కేటాయించడం జరుగుతుంది. రహదారి నిర్మాణంలో భాగంగా మొత్తం 10,387 చెట్లును తొలగించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా 31,191 చెట్లను ఎవెన్యూ ప్లాంటేషన్ క్రింద రోడ్లకు ఇరువైపులా పెంచడానికి నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక రూపొందించింది. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా ముఖచిత్ర స్వరూపం మారిపోతుంది. విజయనగరం జిల్లా ప్రగతిపధంలో అడుగిడే అవకాశం ఉంది.