సినిమాల కోసం మొహం వాచి ఉన్న సినిమా అభిమానులకు సెప్టెంబరు నెల పండుగ చేయబోతోంది. ఇప్పటిదాకా సినిమా థియేటర్లు త్వరలోనే ప్రారంభమవుతాయన్న ఆశ నిర్మాతల్లో నెలకొంది. ఇప్పుడా ఆశ అడుగంటింది. దాంతో కొత్త ఒప్పందాలకు తెరతీశారు. మొదట ఓటీటీలో సినిమాను ప్రదర్శించి ఆ తర్వాత మళ్లీ థియేటర్లలో విడుదల చేసేలా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. దీంతో పెద్ద హీరోల సినిమాలు ఓటీటీలో సందడి చేయడానికి మార్గం సుగమం అయింది. ఈ సినిమాల మీద భారీగా పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు భారీగా నష్టాలను భరించారు. వడ్డీలు తడిసిమోపెడయ్యాయి. ఇలా ఇంకా కొంత కాలం ఉంటే ఇబ్బందికరమే. దాంతో ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు.
వరుసగా పెద్ద సినిమాల క్యూ
నాచురల్ స్టార్ నాని ‘వి’ సినిమా దీనికి నాంది పలుకనుంది. సెప్టెంబరు 5న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శితం కానుంది. 37 కోట్ల భారీ ఆఫర్ తో ఈ సినిమా హక్కుల్ని అమెజాన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత దీన్ని థియేటర్లలో విడుదల చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్ నెలలోనే ఈ సినిమా విడుదల కావలసి ఉంది. మరో మెగా హీరో నటించిన ‘ఉప్పెన’, హీరో రామ్ ‘రెడ్’ అనుష్క ‘నిశ్శబ్దం’… లాంటి చిత్రాలన్నీ కరోనా లేకపోతే ఎప్పుడో విడుదలయ్యేవి. ఇప్పుడు నాని ‘వి’తో పాటు వీటిని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
వివిధ ఓటీటీలతో వీరు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ తర్వాత థియేటర్లలో విడుదల చేసేలానే ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు వినికిడి. మొదట్లో దర్శకనిర్మాతలు ఓటీటీలో విడుదలకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఇలా రిలీజైతే ఎంతో కొంత డబ్బు వసూలవుతుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. అనుష్క ‘నిశ్శబ్ధం’ కూడా సెప్టెంబరులో ఓటీటీలో రానుంది. అదేబాటలో రవితేజ ‘క్రాక్’ కూడా ఉంది.

బాలీవుడ్ లో కూడా ఇదే ఆలోచన సాగుతోంది. అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీబాంబ్’ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబరు 9 ప్రదర్శితం కానున్నట్లు సమాచారం. ఇందులో అక్షయ్ సరసన కైరా అద్వానీ నటించింది. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘కాంచన 2’ చిత్రమే ‘లక్ష్మీబాంబ్’ వస్తోంది. దీనికి హిందీలోనూ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఓటీటీలో దీనికి రూ. 125 కోట్లు బిజినెస్ పలికినట్లు సమాచారం. కరోనా శాపానికి ఓటీటీ ఓ వరంగా ఇప్పుడు భావిస్తున్నారు నిర్మాతలు.
బిజినెస్ వివరాలు:
సెప్టెంబరు 5 : వి
వేదిక: అమెజాన్ ప్రైమ్
డీల్ : 37 కోట్లు
సెప్టెంబరు 9 : లక్ష్మీబాంబ్
వేదిక : డిస్నీ ప్లస్ హాట్ స్టార్
డీల్ : 125 కోట్లు










