ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న ఓ బెంగుళూరు యువతి వందేభారత్ మిషన్ లో భాగంగా.. ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానంలో హైదరాబాదు ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. శంషాబాద్ సమీపంలోని ఒక ప్రెవేటు రెసిడెన్సీ లో ఆమె గది తీసుకుంది. తన స్వస్థలం బెంగుళూరు వెళ్లడానికి అవసరమైన అనుమతుల కోసం అప్లయి చేసుకుని హోటల్ గదిలో ఉంది.
అదే సమయానికి పురేందర్ కుమార్, విజయ్ కుమార్, ప్రవీణ్ కుమార్ అనే యువకులు ముగ్గురూ అదే హోటల్లోని మరో గది అద్దెకు తీసుకుని ఉన్నారు. ఈ ముగ్గురిలో పురేందర్ కుమార్.. నంద్యాలలో వైఎస్సార్సీపీ నాయకుడు. మునిసిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గా బరిలో ఉన్నాడు. శంషాబాద్ కుచెందిన ప్రవీణ్ కుమార్, నంద్యాల నుంచి వచ్చిన ఇద్దరు మిత్రులతో కలిసి పార్టీ చేసుకోడానికి అదే హోటల్లో గది తీసుకుని ఉన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన అమ్మాయి పట్ల వారు అసభ్యంగా ప్రవర్తించారు. బాగా మద్యం సేవించి ఆమె గది తలుపు తట్టడంతో, హోటల్ సిబ్బంది అనుకుని ఆమె తలుపు తీసింది. వారు అత్యాచారానికి ప్రయత్నించారు. దీంతో ఆమె తెలివిగా వెంటనే 100 నెంబరుకు డయల్ చేసింది.
పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తెల్లారిన తర్వాత.. మద్యం మత్తులోనే అలా ప్రవర్తించామని, తమకు ఏమీ గుర్తులేదని వారు బుకాయించడం విశేషం.
ఈ చొరవ అమ్మాయిలందరికీ అవసరం
పొరబాటున హోటల్ సిబ్బంది అనుకుని తలుపు తీసినప్పటికీ.. అత్యాచారానికి ప్రయత్నించిన ముగ్గురిని చూడగనే బెంబేలెత్తి పోకుండా.. బెంగుళూరు యువతి 100 కు ఫోన్ చేయడం గమనించాల్సిన విషయం. విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. అమ్మాయిలందరూ కూడా ఇలాంటి చొరవ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మృగాళ్ల ఆగడాలు మితిమీరుతున్న తరుణంలో.. ఎవరికి వారే ఆమెలాగా జాగరూకతతో ఉండాలని పలువురు భావిస్తున్నారు.










