‘ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా…’ అన్న యోగి వేమన మాటలు ఏపీలోని రాజకీయ పార్టీలకూ సరిగ్గా సరిపోతోంది. వైఎస్సార్‌సీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు… జనసేనలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్… టీడీపీలో ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరి, కరణం బలరాం…అసమ్మతి బావుటా ఎగురవేసి తమ పార్టీ నాయకత్వాలకు మంటలు పుట్టిస్తున్నారు. పార్టీకీ పదవులకు రాజీనామా చేయరు. ప్రత్యర్థి పార్టీలో అధికారికంగా చేరరు.. పార్టీలో ఉంటూనే శల్యుని పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు చప్పగా ఉంటాయనుకున్న రాష్ట్ర రాజకీయాలకు కాస్త మసాలా అద్దుతున్నారు.
వైఎస్సార్‌సీపీని కాకెక్కిస్తున్న ‘రెబల్ స్టార్’
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు బలం..ఇక తనకు తిరుగులేదని సీఎం వైఎస్ జగన్ అలా సేదదీరుతుండగా… నేనున్నానంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు పార్టీలో అసమ్మతి ధ్వజం ఎగురవేశారు. రాజకీయ పరమైన కారణాలో వ్యాపారపరమైన ప్రయోజనాలో ఎక్కడ తేడా కొట్టిందో తెలియదుగానీ ఆయన ఒక్కసారిగా రెబల్‌స్టార్‌గా మారిపోయారు. రోజుకో రీతిలో ప్రభుత్వంపై నేరుగా సీఎం జగన్‌పై పరోక్షంగా దాడి మొదలుపెట్టారు. గోదావరి జిల్లాల వెటకారాన్ని జోడిస్తూ సీఎం జగన్‌పై బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఆ విమర్శలు చేస్తున్న టైమింగ్, మాటల్లో వ్యంగ్యం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సింహాన్ని గిల్లి కలుగులోకి జారిపోతున్న ఎలుకలా రఘురామకృష్ణం రాజు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూ బీజేపీ చాటున నక్కుతున్నారు. కొన్నిరోజులు ప్రతివిమర్శలు చేసిన వైఎస్సార్‌సీపీ తరువాత ఆయనను అనర్హుడిగా ప్రకటించమని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించి చేతులు దులుపుకుంది. ఇదే అదనుగా ఎంపీ రఘురామకృష్ణం రాజు విమర్శల జోరు పెంచుకుంటూ పోతున్నారు.
జనసేనతో ఆడుకుంటున్న ‘రాపాక’
మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లైంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి. అసలే ఎంతో హైప్‌తో రిలీజ్ చేసిన జనసేన సినిమా బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడిందని ఆయన నిస్పృహలో కూరుకుపోయారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా వెంటనే జగన్ పంచన చేరి తనను వెక్కిరిస్తుంటే ఆయనకు పుండుపై కారం చల్లినట్టుగా ఉంటోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఆయన ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. పార్టీ మీటింగ్‌లకు రారు. ‘ పార్టీ అధ్యక్షుడే రెండు చోట్ల ఓడిపోయారు… రాష్టరంలో నేనొక్కడినే గెలిచాను. ఇది నా గెలుపే గానీ పార్టీ గెలుపు కాదు’ అని తేల్చేశారు. గట్టిగా ప్రతి విమర్శలు చేద్దామంటే సామాజికవర్గ సమీకరణల పరంగా సున్నితమైన అంశంగా మారింది. Sవిప్ జారీ చేసే అవకాశం లేదు. రాపాక వర ప్రసాద్ ఏకైక ఎమ్మెల్యే కాబట్టి ఆయనే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్…ఆయనే విప్. జనసేన శాసనసభా పక్షాన్ని వైఎస్సార్‌సీపీలో విలీనం చేసినా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకే పవన్ కల్యాణ్ మౌనంగా ఉండిపోవడం మినహా మరేమీ చేయలేకపోతున్నారు. అదే అవకాశంగా రాపాక వర ప్రసాద్ ఏకంగా జనసేను గాలిలో వచ్చిన పార్టీ అనేశారు. అయినా సరే పవన్ కల్యాణ్ ఓసారి గట్టిగా నిట్టూర్పు విడిచి మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. అదీ జనసేన పరిస్థితి.
చంద్రబాబుతో ఆ ముగ్గురూ చెడుగుడు
రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యేలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ‘నీవు నేర్పియ విద్యయే చంద్రబాబు’ అంటూ టీడీపీతో చెడుగుడు ఆడేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోగానే సమయం చూసి ఒకరి తరువాత ఒకరుగా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (కృష్ణా జిల్లా), మద్దాల గిరి (గుంటూరు జిల్లా), కరణం బలరాం (ప్రకాశం జిల్లా) చంద్రబాబుకు ఝలక్ ఇస్తూ జగన్ పంచన చేరిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికిపాటి మోహనరావులను చంద్రబాబు నేరుగా ఒక్క మాట కూడా అనలేదు. ఆయనే వారిని వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపారన్న వాదనకు టీడీపీ మౌనం, ఆ నలుగురు బీజేపీలో ఉంటూ టీడీపీ వాదనను లేవనెత్తుతున్న తీరే నిదర్శనం. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీతో జట్టు కట్టిన ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలను చంద్రబాబు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు. ఇదే అదనుగా ఆ ముగ్గురు చంద్రబాబుపై విమర్శల దాడి మొదలుపెట్టారు. ప్రధానంగా వల్లభనేని వంశీ అయితే లోకేశ్ సమర్థతను వెక్కిరిస్తూ వ్యంగ్యాస్త్రాలు వదలుతున్నారు. ప్రతివిమర్శలు చేసే టీడీపీ నేతలపై ఓ రేంజ్‌లో చెలరేగిపోతూ రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలని టీడీపీ ఉద్యమిస్తుండగా…అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు (వారిలో ఇద్దరు చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారే) పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఆ ముగ్గుర్నీ అనర్హులుగా ప్రకటించాలని కోరడానికి వారు సాంకేతికంగా అవకాశాలు ఇవ్వకుండా జాగ్రత్తపడుతుండటం గమనార్హం. దాంతో వారి విమర్శలను భరిస్తూ… టీడీపీ మౌనంగా తన పని తాను చేసుకుంటోంది.