మాజీ మంత్రులు పరిటాల సునీత, నీలకంఠాపురం రఘువీరారెడ్డిలది అనంతపురం జిల్లానే కదా. ఒకే జిల్లాకు చెందిన వీరిద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు. రఘువీరా కాంగ్రెస్ లో ఉంటే.. పరిటాల ఫ్యామిలీ టీడీపీతో సాగుతోంది. పరిటాల రవీంద్ర ఉన్నప్పటి నుంచి కూడా ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరమే కొనసాగింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో వ్యవసాయ శాఖ మంత్రి తనదైన శైలిలో సత్తా చాటిన రఘువీరా.. ఆ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా, ఆ తర్వాత పీసీసీ చీఫ్ గా వ్యవహరించారు. ఇక పరిలాట రవి హత్య తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల సునీత.. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో పరిటాల వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పరిటాల శ్రీరామ్.. ఎన్నికల్లో ఓడిపోయినా.. టీడీపీ తరఫున తనదైన శైలి పోరాటం సాగిస్తున్నారు.
అంతా ఆధ్యాత్మికమే
పీసీసీ చీఫ్ గా పనిచేసిన కొంతకాలానికే రాజకీయాలను దాదాపుగా వదిలేసిన రఘువీరారెడ్డి.. తన సొంతూళ్లో నీలకంఠేశ్వరుడి ఆలయాన్ని నిర్మించారు. తన సొంత నిధులతో నిర్మించిన ఈ ఆలయం ఇప్పుడు ఏపీలో చాలా మంది నోట వినిపిస్తోంది. భక్తులు కూడా ఈ ఆలయ దర్శనం కోసం ప్రత్యేకించి మరీ వెళుతున్నారు. ఇటీవలే టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఆలయాన్ని సందర్శించారు. రాజకీయ ప్రముఖులే కాకుండా ఏ రంగానికి చెందిన ప్రముఖులు వచ్చినా స్వయంగా దగ్గరుండి మరీ ఆలయ విశిష్టతను వివరిస్తూ సాగుతున్న రఘువీరా.. జేసీని కూడా ఆలయం మొత్తం తిప్పి ప్రతి చిన్న అంశాన్ని కూడా వివరించారు.
పరిటాలకు ఆత్మీయ స్వాగతం
ఈ క్రమంలోనే ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు పరిటాల సునీత తన కుమారుడు శ్రీరామ్ తో కలిసి నీలకంఠాపురం వచ్చారు. పరిటాల సునీత, శ్రీరామ్ లకు రఘువీరానే స్వయంగా స్వాగతం పలికారు. అప్పటిదాకా రాజకీయాల్లో వాగ్బాణాలు సంధించుకున్న రఘువీరా, సునీతలు మంచి మిత్రుల్లా నవ్వుతూ కనిపించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల శ్రీరామ్ భుజం తట్టిన రఘువీరా.. రాజకీయాల్లో మెరుగ్గా రాణించాలని అభిలషించారు. రఘువీరా భుజంపై చేయేస్తే.. ఉప్పొంగిపోయిన పరిటాల శ్రీరామ్.. ఆయనకు నమస్కరిస్తున్న ఫొటోలు వైరల్ గా మారిపోయాయి. ఆ తర్వాత వారిద్దరికీ ఆలయం విశిష్టతలు వివరిస్తూ.. ఆలయం మొత్తం చూపించిన రఘువీరా.. నీలకంఠుడి దర్శనాన్ని దగ్గరుండి మరీ చేయించారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.











