వార్తల్లోకి ఎలా ఎక్కాలో బండ్ల గణేశ్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో. డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో ప్రకంపనాలు పుట్టిస్తుంటే నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ మాత్రం తాపీగా ఈడీ కార్యాలయానికి రావడం ఆశ్చర్యం కలిగించింది. ఈరోజు దర్శకుడు పూరి జగన్నాథ్ ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ఈడీ నుంచి నోటీసులు అందుకున్న వారిలో బండ్ల గణేశ్ లేరు. పూరీని దాదాపు 8 గంటలపాటు విచారించారు.మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలపైనే ప్రధానంగా ఈడీ దర్యాప్తు సాగుతోంది. ఇలాంటి సమయంలో పూరీకి ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వాలనుకున్నారో తెలియదుగానే ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షంకాగానే అందరూ ఆశ్చర్యపోయారు.
పూరిని కలుసుకోడానికి అక్కడికి వచ్చినట్టు ఆయన తెలిపారు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు తీశారు. అలా ఇద్దరి మధ్యా స్నేహం ఉంది. అలా అనుకుంటే బండ్ల గణేశ్ కు ఇండస్ట్రీలో ఇంకా చాలామంది స్నేహితులు ఉన్నారు. రవితేజ విచారణ కూడా ఉంది. మరి అప్పుడు కూడా బండ్ల గణేశ్ వస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎందుకొచ్చారని కొందరు ఆయన్ను అడిగితే ‘నాకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదు.. నా మిత్రడు పూరి కోసమే వచ్చా.. నాకెందుకు నోటీసులు ఇస్తారు’ అని వివరణ ఇచ్చారు.











