సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు వారి పాత్రల పేర్లనే టైటిల్స్ గా పెడుతుంటారు. నాటి సినిమాల నుంచి నేటి సినిమాల వరకూ ఇది ఇంకా కొనసాగుతునే ఉంది. ఆ తర్వాత హీరోల క్వాలిటీస్ ను టైటిల్స్ గా పెట్టడం కూడా ఎక్కువైంది. తిరుగులేని మనిషి , ఎదురులేని మనిషి , మొనగాడు, రోషగాడు, మోసగాడు, సరైనోడు లాంటి పేర్లన్నమాట. ఇక ఇప్పుడు ఈ తరం దర్శకులు .. ఏకంగా హీరోల ప్రొఫెషన్స్ ను టైటిల్స్ గా పెడుతున్నారు. ప్రస్తుతం ఈ తరహాలోనే కొన్ని సినిమాల టైటిల్స్ అభిమానుల్ని ఆకర్షిస్తున్నాయి .
‘వకీల్ సాబ్’గా పవర్ స్టార్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కోర్ట్ రూమ్ డ్రామా ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ మూవీ పింక్ కు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ‘నొర్కొండ పార్వై’ గా ముందుగా తమిళంలో రీమేక్ అయిన సినిమాలో అజిత్ హీరోగా నటించాడు. ఇదే సినిమాను పవన్ ఇమేజ్ కు అనుగుణంగా మార్పులు చేసి.. వకీల్ సాబ్ గా రూపొందుతోంది. కొందరు అమ్మాయిలు ఒక కేసులో దోషులు గా కోర్ట్ లో నిలబడతారు. వకీల్ సాబ్ అయిన పవర్ స్టార్ వారికి అండగా నిలిచి.. న్యాయాన్ని గెలిపిస్తాడు. నల్లకోటు తొడిగిన స్టైలిష్ వకీల్ సాబ్ గా పవన్ నటన ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్.
‘ఫైటర్’గా విజయ్ దేవరకొండ
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అరుదైన కలయికలో రూపొందుతోన్న యాక్షన్ మూవీ ‘ఫైటర్’. ఇందులో విజయ్ ప్రొఫెనల్ కిక్ బాక్సర్ గా నటిస్తున్నాడు. లాక్ డౌన్ కు ముందే లాంచింగ్ జరుపుకున్న ఈ సినిమా .. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. పూరీకి బాగా కలసి వచ్చిన లొకేషన్ హైద్రాబాద్ లోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీలో.. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ తో షెడ్యూల్ మొదలు పెట్టనుంది. ఫైటర్ పాత్ర కోసం విజయ్ .. బాగా కసరత్తులు చేస్తున్నాడట, కిక్ బాక్సింగ్ లో కోచింగ్ కూడా తీసుకుంటున్నాడట.
‘బాక్సర్’గా వరుణ్ తేజ
వరుణ్ తేజ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘బాక్సర్’. ఓ బాక్సింగ్ ఛాంపియన్ కథగా ఈ సినిమా తెరకెక్కనుందట. ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా నీరజ్ గోయత్ అనే బాక్సర్ దగ్గర కోచింగ్ తీసుకున్నాడట. సిద్ధూ ముద్దా, అల్లు వెంకటేశ్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోన్న బాక్సర్ వరుణ్ తేజ కెరీర్ ను మలుపుతిప్పుతుందని చెబుతున్నారు.
‘డాక్టర్’గా శివకార్తికేయన్
ప్రాణం పోయాల్సిన డాక్టర్ కు ప్రాణం తీసే పరిస్థితి ఎదురైతే.. అతడి మానసిక స్థితి ఎలా ఉంటుందనే వెరైటీ కాన్సెప్ట్ తో ‘డాక్టర్’ తమిళ సినిమా తెరకెక్కుతోంది. శివకార్తికేయన్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ యస్కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా అదే పేరుతో తెలుగులో కూడా విడుదల కాబోతోంది. శివకార్తికేయన్ కుర్చీలో కూర్చుని ఉంటే.. అతడి చుట్టూ కత్తులు కనిపిస్తుంటాయి. అతడి చేతిలో కత్తి , ఆ చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది. ఫస్ట్ లుక్ గా విడుదలైన ఈ స్టిల్ వైరల్ గా మారింది.
సో… ప్రొఫెషనల్స్ గా అదరగొట్టనున్న ఈ హీరోల్లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.