విజయనగరం మాన్సాస్ ఛైర్పర్సన్ సంచైత గజపతిరాజు తీరు అభ్యంతరకరం అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అండతో ఆగమేఘాల మీద మాన్సాస్ ఛైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన మరుక్షణం నుంచి ఆమె నిర్వహిస్తున్న దుందుడుకు వ్యవహారాలు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆమె నిర్ణయాలు అనేకం వివాదాస్పదం అవుతున్నాయి. వివాదాస్పద నిర్ణయాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రజల నుండి పలుమార్లు వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఆమె తీరు మారకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఆనందగజపతి కుటుంబానికి పరాభవం
విజయనగర రాజుల వారసుడు పూసపాటి ఆనందగజపతి రాజు భార్య సుధా గజపతి, ఆయన కుమార్తె ఊర్మిళ గజపతికి శ్రీ పైడితల్లి అమ్మవారి సాక్షిగా పరాభవం ఎదురైంది. ఆ పరాభవానికి కారకురాలుగా నిలిచింది ఇంకెవరో కాదు ఆనందగజపతి రాజు మొదటి భార్య కుమార్తె సంచైతనే. సంప్రదాయబద్ధంగా ప్రతిఏటా మాదిరిగానే సిరిమానోత్సవం చూడటానికి మంగళవారం సాయంత్రం ఊర్మిళ గజపతి తన తల్లి సుధా గజపతితో కలిసి కోట బురుజుపైకి చేరుకున్నారు.
అక్కడ సిబ్బంది వారిని సాదరంగా స్వాగతించి కూర్చోబెట్టారు. అక్కడకు కొంత సమయం తర్వాత కోట బురుజుపైకి చేరుకున్న సంచైత ఊర్మిళను, వాళ్ల అమ్మను చూసి శివాలెత్తారు. వారిని ఇక్కడ కూర్చోబెట్టిందెవరని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని బయటకు పంపించేయమని హుకుం జారీ చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ సిబ్బంది ఊర్మిళను, వాళ్ల అమ్మను బలవంతాన సాగనంపడంతో వారు చాలా అవమానంగా భావించారు.
మా హక్కు కాదా ..?
‘‘మాన్సాస్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా, రాజకుటుంబ వారసులుగా ప్రతి సంవత్సరం విజయనగరం కోట నుండి సిరిమానోత్సవం చూడటం మా సంప్రదాయమే. నా తల్లి మరియు నేను ఈ సంవత్సరం హాజరు కావడానికి మొదటి సంశయించాము. కానీ సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇష్టపడలేదు. చేరుకున్న తరువాత, ఇతర కుటుంబ సభ్యులెవరూ లేరని మేము గ్రహించాము.
ఇది విజయనగర రాజుల కుటుంబ కార్యక్రమం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమం. అందుకే అమ్మవారిని దర్శించుకునేందుకు వేచివున్నాం. అటువంటి తరుణంలో నా తండ్రి కోసం 20 సంవత్సరాలు పనిచేసిన మరియు 16 సంవత్సరాలు నన్ను ఎదగడం చూసిన వ్యక్తులు ఆ వ్యక్తి (సంచైత) ఒత్తిడి కారణంగా మమ్మల్ని ఆ స్థలం విడిచిపెట్టమని కోరారు.
ఇతరులను అగౌరవపరిచే ప్రయత్నం మీ స్వంత పాత్రను తెలుపుతుంది. వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా హాజరుకావడం మా హక్కు కాదా? నేను గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం హాజరవుతున్నాను.’’ అంటూ సిరిమానోత్సవం తరువాత ఊర్మిళ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
పూసపాటి వంశీయుల వారసురాలను, ఆనందగజపతి రాజు కూతురును నేను నాకు హక్కు లేదా, నేను వారసురాలను కానా అంటూ బాబాయ్ అశోక్ ను ప్రశ్నించిన సంచైతకు, ఊర్మిళ గురించి తెలియదా, ఆమెకు హక్కు లేదా అని విజయనగరం వాసులు చర్చించుకుంటున్నారు. అదే తరుణంలో ఇదేమి వింతపోకడని ఆశ్చర్యపోతున్నారు.











