లోన్ల కోసం తమ వద్దకు వచ్చే వారి అవసరాలను ఆసరాగా చేసుకుని మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ బ్యాంక్ మేనేజర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ నగేష్ కామ కలాపాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో బట్టబయలయ్యాయి. ఈ మేనేజర్ వికృత చేష్టలకు ఎందరో మహిళలు బలై వేదనకు గురయ్యారు.
ఒంటరిగా తన క్యాబిన్‌కు పిలిపించుకుని..
లోన్ల కోసం వచ్చే మహిళలను ఒంటరిగా మేనేజర్ తన క్యాబిన్‌కు పిలిపించుకుని లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. లోన్ గురించి వచ్చే మహిళల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. మహిళల ప్రైవేట్ భాగాలను తాకుతూ వికృతానందాన్ని పొందేవాడు మేనేజర్ నగేష్. రుణాలు రాకుండా అడ్డుకుంటాడేమోనని భయంతో బాధిత మహిళలు మిన్నకుండిపోయేవారు. మరి కొంతమంది తమ పరువు పోతుందని భావించి బయటకు చెప్పుకోలేకపోయారు. సీసీ టీవీలో రికార్డైన ఫుటేజీ వైరల్ కావడంతో నగేష్ వికృత చేష్టలు వెలుగు చూశాయి. దీంతో మీడియా ఛానళ్లలో నగేష్ వికృత చేష్టల వీడియోలు ప్రసారం కావడంతో బ్యాంక్ నుంచి పరారయ్యారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నగేష్ కోసం గాలింపు చేపట్టారు. ఇలాంటి కామంధులను కఠినంగా శిక్షించి, మహిళలను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.











