వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆ పార్టీకే చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలి పోరును సాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే జగన్ కు దక్కిన బెయిల్ ను రద్దు చేయాలంటూ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సంచలన రేకెత్తించిన రఘురామరాజు… తాజాగా జగన్ కేసులను త్వరితగతిన ముగించేలా సీబీఐతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పరిణామం జగన్ వర్గానికి బిగ్ షాకింగేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
జగన్ కు పక్కలో బల్లెంలా రఘురామ
2019 సార్వత్రిక ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలో చేరిన రఘురామరాజు తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోని నరసాపురం పార్లమెంటు స్ధానం నుంచి ఎంపీగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత ఒకటి రెండు పర్యాయాలు జగన్ తో కలిసి కనిపించిన రఘురామ… ఆ తర్వాత సీఎంగా జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ జగన్ కు పక్కలో బల్లెంలా మారిపోయారు. ఈ క్రమంలో దాదాపుగా వైసీపీకి వైరి వర్గంగానే మారిపోయిన రఘురామ… దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే స్పీడులో దూసుకెళ్లిన రఘురామ.. జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో రఘురామపై కక్ష పెంచుకున్నట్లుగా కనిపించిన జగన్ సర్కారు.. ఆయనను అరెస్ట్ చేయించిందన్న వాదనలు వినిపించాయి.
సీబీఐ, ఈడీలను అదిలించండి
అరెస్ట్, కస్టడీలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం నేపథ్యంలో జగన్ సర్కారుపై రఘురామరాజు ప్రత్యక్ష పోరాటాన్ని తనదైన స్పీడులో కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ పై దాఖలైన అక్రమాస్తుల కేసుల విచారణను సీబీఐతో పాటు ఈడీ కూడా ఉద్దేశపూర్వకంగానే సాగదీస్తున్నాయని, అసలు ఈ కేసులను ఇప్పుడప్పుడే ముగించేలా ఆ సంస్థలు కనిపిస్తున్నాయని ఆరోపిస్తూ… జగన్ పై కేసులను త్వరితగతిన ముగించేలా దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలంటూ సంచలన పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ జగన్ వర్గానికి మరింత ఇబ్బందికరంగా మారే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.