ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల కేసులో తనను అరెస్టు చేసి 48 గంటల పాటు జైల్లో ఉంచడం ద్వారా తన ఉద్యోగం కోల్పోయాలా చూడాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని నిరోధించేందుకు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం రెండు వారాల పాటు ఏబీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి కేసు విచారణను జనవరి 18వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
కేసు పూర్వాపరాలు
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. ఆయన పదవిలో ఉండగా ఇంటిలిజెన్స్ విభాగం జరిపిన భద్రతా పరికరాల కొనుగోళ్లలో ఏబీ అవినీతికి పాల్పడ్డాడనే కేసును ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏబీని అరెస్టు చేసి 2 రోజుల పాటు జైల్లో పెడతారనే అనుమానంతో ముందస్తుగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని 48 గంటలకు మించి జైల్లో ఉంచితే ఉద్యోగం కోల్పోతారు. ఉద్యోగం నుంచి తొలగించేందుకే తనని తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేయాలని చూస్తున్నారని ఏబీ హైకోర్టును ఆశ్రయించారు.