షణ్ముఖ ప్రియ.. తెలుగులో లిటిల్ ఛాంపియన్‌గా అందరికీ సుపరిచితమైన ఈ పేరు.. నేడు దేశమంతా తన గానాన్ని వినిపించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే పలు భాషా సంగీత పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన షణ్ముఖ ప్రియ.. జీ టీవిలో జరిగిన ‘సరిగమప లిటిల్ ఛాంప్స్’ లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. చిన్నతనంలోనే సంగీత సరస్వతిగా పేరుగాంచి.. నేడు ఇండియన్ ఐడిల్‌గా నిలవడానికి పోటీపడుతుంది. మరి సంగీత ప్రియులను తన అమృత గానంతో ఉర్రూతలూగిస్తున్న ఈ చిన్నదాని ప్రస్థానమేమిటో తెలుసుకుందామా..
సంగీత నేపథ్యమే బలం
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టానికి చెందిన శ్రీనివాస్ కుమార్, రత్నమాల గారాల పట్టి షణ్ముఖ ప్రియ. వీరు శాస్త్రియ సంగీతంలో ఎం.ఎ పట్టా పొందినవారు కావడం విశేషం. దీనితోపాటు శ్రీనివాస్ కుమార్ వయోలిన్, వీణ వాయించడంలో ప్రావీణ్యం పొందారు. వీరిద్దరి వారసురాలిగా సంగీతాన్ని పునికిపుచ్చుకుంది ఈ చిన్నారి. 4 ఏళ్ల వయస్సులో సంగీతంలో ఓనమాలు దిద్దించారు తల్లిదండ్రలు. షణ్ముఖ ప్రియకు తల్లిదండ్రులే గురువులుగా మారారు. అందుకేనేమో ఈ చిన్నారి సంగీతంలో అనతి కాలంలోనే ప్రజ్ఞ సంపాదించగలిగింది. సరిగమప లిటిల్ ఛాంప్స్ తెలుగు అనే కార్యక్రమం ద్వారా సంగీత పోటీల్లో తన మొదటి అడుగు వేసింది షణ్ముఖ ప్రియ. అప్పుడు తన వయసెంతో మీకు తెలుసా.. కేవలం ఆరేళ్లు..
Must Read ;- పాటకు పెద్ద పీట వేసిన మర్యాద రామన్న ‘బాలు’
6 ఏళ్ల వయస్సుకే మొదలుపెట్టింది..
ఎవరైనా 6 ఏళ్ల వయస్సులో ఏం చేస్తుంటారు? స్కూలుకెళ్లడం.. ఆడుకోవడం.. అంత చిన్న వయస్సులో కనీసం అ..ఆ.. లుకూడా సరిగా రావు. కానీ, 6 ఏళ్ల వయసులోనే తన సంగీత ప్రస్థానాన్ని మొదలుపెట్టింది షణ్ముఖ ప్రియ. ఓ ప్రముఖ టీవి ఛానల్ లో ప్రసారమైన సరిగమప లిటిల్ ఛాంప్స్ తెలుగులో స్టేజ్‌పై తన గానంతో అందరినీ మంత్ర ముగ్దులను చేసింది. ఈ వయస్సుకు స్పష్టంగా మాటలే రావు.. ఈ చిచ్చర పిడుగు ఏకంగా పాటలే అలవోకగా పాడుతుందేంటీ అని పేరు గాంచిన గాయకులు, సంగీత దర్శకులు సైతం ముక్కునవేలేసుకున్నారు.
అలుపెరగని ప్రస్థానం..
అలా మొదలైన తన సంగీత ప్రస్థానం భాషా భేదం లేకుండా పలు భాషల్లోని సంగీత కార్యక్రమాల్లో పోటీ చేసి కొన్నింటిలో విజేతగా కూడా నిలిచింది. మరి కొన్నింటిలో ఫైనలిస్ట్‌గా నిలిచి అందరి ప్రశంసలందుకుంది. ఈ పోటీలు తన సంగీత ప్రతిభను దేశ, విదేశాలకు చాటింది. సంగీత ప్రియులకు షణ్ముఖ ప్రియ అనే పేరు చాలా సుపరిచితమైనది. తన గానానికి ముగ్ధులకాని వారుండరనడంలో సందేహం లేదు. అంతలా అందరినీ ఆకట్టుకుంది ఈ అమృత గాయకురాలు. ఈ పోటీలు తనకు పేరు తెచ్చుపెట్టడమే కాదు.. సంగీత ప్రపంచంలోని దిగ్గజాలను పరిచయం చేసింది. వారి నుండి ఎన్నో మెలకువలు నేర్చుకునే అవకాశం కలిగింది. అలా తన సంగీతానికి మెరుగులు అద్దుకుంటూ అప్రతిహత ప్రస్థానాన్ని సాగిస్తూ.. నేడు ‘ఇండియన్ ఐడిల్’గా నిలవడానికి ఉర్రూతలూగుతుంది.
ఆల్ ద బెస్ట్..
6 ఏళ్ల వయస్సులో మొదలైన తన సంగీత పోటీ ప్రస్థానానికి ఎక్కడా విరామమన్నదే లేకుండా సాగిపోతున్న ఈ చిన్నారి.. నేడు భారతదేశంలోనే పేరుగాంచిన సంగీత పోటీ ‘ఇండియన్ ఐడిల్’లో సైతం తన గానామృతంలో అందరినీ ఆకట్టుకుంటూ సాగిపోతుంది. మన రాష్ట్రం నుండి పోటీ పడుతున్న ఈ సంగీత సరస్వతి ‘ఇండియన్ ఐడిల్’లో విజేతగా నిలిచి మన ఏపీ పేరు దేశమంతా మార్మోగేలా చేయాలని కోరుకుందాం. ఇది కేవలం ఒక మైలురాయి మాత్రమే.. ఇంతకు మించి తను పేరు తెచ్చుకోవాలని.. తన అమృతగానంతో అందరినీ మంత్రముగ్దలను చేయాలని కోరుకుందాం.
Also Read ఎల్లలులేని సంగీతమే ఏఆర్ రెహ్మాన్ (బర్త్ డే స్పెషల్)