ఉదయం సమావేశం మొదలు కాగానే.. ‘అమ్మ’ వారందరికీ విన్నపం రూపంలో ఝలక్ ఇచ్చారు. ‘ఈ బరువు నేను మోయలేను.. ఇక ఈ పార్టీ పదవి నుంచి నన్ను తప్పించండి’ అని స్పష్టంగా తెగేసి చెప్పేశారు. దరిమిలా సాయంత్రం దాకా నానా గందరగోళం సాగింది. సాయంత్రానికి అందరూ కలిసి.. ఆమెనే పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగేలా ఒప్పించారు. ఆ రకంగా సోనియమ్మ మళ్లీ పగ్గాలు పుచ్చుకుంది. ఆమె పార్టీ పగ్గాలు తిరిగి పుచ్చుకోవడం అయిష్టంగా జరిగిందో, ఇష్టపూర్వకంగా జరిగిందో తర్వాత.. కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు మాత్రం.. నీవు తప్ప ఇంకొక దిక్కు లేదని ఈ నిర్ణయం ద్వారా చాటుకున్నాయి.
సాయంత్రం దాకా సమావేశం జరిగిన తర్వాత.. చిట్టచివరికి సోనియానే దిక్కయింది. రాహుల్ అందరిమీద నిప్పులు చెరిగారు గానీ.. పగ్గాలు పుచ్చుకోడానికి మాత్రం ఒప్పుకోలేదు. మన్మోహన్ సింగ్, ఆంటోనీ వంటి పెద్దలు సోనియానే ఒప్పించారు. ప్రస్తుతానికి ఆమెనే కొనసాగాల్సిందిగా కోరారు.
‘నీవే తప్ప ఇతఃపరంబెరుగ’ అని గజేంద్రమోక్షంలో గజేంద్రుడు- విష్ణమూర్తిని ప్రార్థిస్తాడు. నీవు తప్ప ఇంకొక దిక్కులేదు దేవుడా.. వచ్చి కరుణించు.. ఆదుకో.. అని చిట్టచివరి ప్రయత్నంగా వేడుకుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే అచ్చంగా అదే తరహాలో కనిపిస్తోంది. సోనియా తప్పితే మాకు వేరే దిక్కులేదు అని వారందరూ కలసికట్టుగా చాటుకుంటున్నట్టుగా ఉంది.











