సినిమాలో హీరో మరో హీరో అభిమానిగా నటించిన సినిమాలో గతంలో చాలానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా ఓ హీరో నటించిన చిత్రాలు ఏమీ రాలేదు. తాజాగా అలాంటి చిత్రం రాబోతోంది. అదే అర్జున ఫల్గుణ చిత్రం. శ్రీవిష్ణు హీరోగా మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తేజ మర్ని దర్శకత్వంో ఈ సినిమాని నిర్మించింది. ఇందులో హీరో శ్రీవిష్ణు పోషించింది హీరో ఎన్టీఆర్ అభిమాని పాత్ర అట. దీనికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే ఆ సినిమా దర్శకుడు తేజ మర్ని స్వతహాగా ఎన్టీఆర్ అభిమాని కావడమే. అందుకే అలాంటి పాత్రతోనే కథను రాసుకున్నాడు. సింహాద్రి సినిమా చూసి ఎన్టీఆర్ అభిమానిగా మారిన హీరో ఇప్పటిదాకా ట్రావెల్ అయిన విధానంతో ఈ పాత్ర ఉంటుందట.
ఈ సినిమా హీరో శ్రీవిష్ణు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పల్లెటూరి నేపథ్యంలో సినిమాలు రావడం తగ్గిపోయింది. అర్జున ఫల్గుణ చిత్రం కేవలం పల్లెటూరి కథే. ఆక్కడ సినిమాలు షికార్డు అంటూ తిరిగే నలుగురు అల్లరి కుర్రాళ్ల కథ ఇది. వినోదం, ఎమోషన్ ప్రధానంగా ఈ సినిమా ఉంటుందంటున్నారు శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన సినిమాలన్నీ టైటిల్ నుంచే ప్రత్యేకత కనిపిస్తుంది. కథ విషయంలోనూ అంతే. అది కావాలని చేసింది కాకపోయినా అలా కలిసి వచ్చిందని, అంతా టీమ్ వర్క్ మహిమేనని కూడా ఈ హీరో అంటున్నారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ‘లియోన్యూస్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా విశేషాలను తెలిపారు.
టైటిల్ అలా వచ్చింది..
‘‘ఈ ఏడాది విడుదలవుతున్న నా మూడో సినిమా ‘అర్జున ఫల్గుణ’. మంచి కథతో వస్తే.. అన్నీ నేనే చూసుకుంటాను. తేజ మర్నిలో మంచి దర్శకుడు కనిపించాడు. అతను ఎంతో ఎదుగుతాడు. ఎమోషన్ సీన్స్ బాగా రాశాడు. అందుకే సినిమా చేశాను. చాలా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేశాడు. 55 రోజుల్లో షూటింగ్ పార్ట్ పూర్తి చేశాడు. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు. అర్జునుడి ఫల్గుణుడు, పార్థుడు, కిరీటీ అని అనేక పేర్లు ఉన్నాయి. పిడుగు పడే సందర్భంలో ఉరిమినప్పుడు అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ, విజయ,.. ఇలా ఓ పది పేర్లు తలుచుకుంటే ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. కానీ అందరూ అర్జున ఫల్గుణ అనే అంటుంటారు.
కొన్ని పేర్లు విన్నప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఇందులోని అర్జున ఫల్గుణ అనే పేర్లలో ఆ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకు ముందు వేరే పేరు అనుకున్నాం. కానీ అది కుదరలేదు. ఒక రోజు వర్షంలో కూర్చుని డైరెక్టర్, నేను మాట్లాడుకుంటుండగా ఈ పేరు తట్టింది’ అని వివరించారు. గ్రామ వాలంటీర్ల గురించి చెప్పిన డైలాగ్ ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, అభ్యంతరకరంగా ఉందనిపిస్తే తీసి వేస్తామన్నారు. తన ప్రతి సినిమాలోనూ స్త్రీ పాత్రను బలంగా చూపిస్తానని, ఇందులో కూడా హీరోయిన్ పాత్ర అలానే ఉంటుందన్నారు.
కానీ తమ గ్యాంగులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఆ అమ్మాయికి మాత్రమే రావడంతో కడుపు మంటతో ఆ పాత్ర అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరించారు. ఏటా మూడు సినిమాలు విడుదలయ్యేలా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నట్టు చెప్పారు. తన మునిపటి సినిమాలకన్నా ఇది ఇంకా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉందన్నారు. ఇందులో ఎన్టీఆర్ అభిమాని పాత్రను పోషించాల్సి వచ్చింది కాబట్టి ఆయన చేసే డ్యాన్స్ లో కొంతైనా ఇందులో చూపించాలన్న ప్రయత్నం చేసినట్టు చెప్పారు.