కల్యాణ్ రామ్ ఒక వైపున నిర్మాతగా .. మరో వైపున హీరోగా తన పనులను చక్కబెడుతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి, కల్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతే. ఆ సినిమాకి సంబంధించిన పనులను చూసుకుంటూనే, హీరోగా మరో సినిమా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. విశేషమేమిటంటే తను హీరోగా నటించే ఈ సినిమాను కూడా ఆయన తన సొంత బ్యానర్లోనే నిర్మిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు.
ఈ సినిమాలో కల్యాణ్ రామ్ ‘డిటెక్టివ్’ పాత్రలో కనిపించనున్నాడు. ‘ఏజెంట్ వినోద్’ అనే టైటిల్ ను సెట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఓ చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్నప్పటికీ, ఆయన వినిపించిన ఈ కథలోని కొత్తదనం .. పాత్రల్లోని వైవిధ్యం కల్యాణ్ రామ్ కి విపరీతంగా నచ్చేసిందట. అందువలన వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. 1940 కాలంలో ఈ కథ నడుస్తుందని చెబుతున్నారు.
కల్యాణ్ రామ్ కి ఆ మధ్య చేసిన ‘118’ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. లుక్ పరంగా .. యాక్టింగ్ పరంగా కూడా ఆయన మంచి మార్కులను దక్కించుకున్నాడు. కానీ ఆ తరువాత చేసిన ‘ఎంతమంచివాడవురా’ సినిమాకి అంతగా ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన తనే నిర్మాతగా మరో ప్రయోగం చేస్తున్నాడు. ఇంతవరకు తాను చేయని కథను .. పాత్రను ఎంచుకుని రంగంలోకి దిగాడు. త్వరలోనే అధికారిక ప్రకటనను చేసేసి, సెట్స్ పైకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. మరి ఈ సినిమాలో కల్యాణ్ రామ్ జోడీగా ఏ భామకి ఛాన్స్ దొరుకుతుందో చూడాలి.











