చాలాకాలం తరువాత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రీ ఎంట్రీ ఇస్తూనే ఆయన ఓ అరడజను సినిమాలను లైన్లో పెట్టాడు.ఆ సినిమాలన్నింటిలో క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాపైనే అభిమానులు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాలో పవన్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, 170 కోట్ల రూపాయలతో రూపొందుతోందట. పవన్ కెరియర్లోనే ఈ స్థాయి బడ్జెట్ ను కేటాయించడం ఇదే ఫస్టు టైమ్ అంటున్నారు.
కథాపరంగా ఈ సినిమా మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో నడుస్తుంది. ఆనాటి చక్రవర్తుల అధీనంలో ఉన్న ‘కోహినూర్’ వజ్రాన్ని కాజేయడానికి కథానాయకుడు ‘వీరమల్లు‘ చేసే ప్రయత్నాల చుట్టూ ఈ కథ తిరగనుంది. చక్రవర్తుల కాలంనాటి కథ కనుక అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించే భారీ సెట్లు అవసరమవుతాయి. ఇందులో ‘చార్మినార్’ సెట్ కూడా ఒకటిగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఇక అప్పటి రాచరిక వ్యవస్థ .. ప్రజల జీవన విధానం .. ఇవన్నీ కథలో భాగంగా కనిపించనున్నాయి. ఆనాటి ప్రజల వేషధారణను ఆవిష్కరించడం మరింత క్లిష్టమైన విషయం.
ఇక కోటలు .. ఏనుగులు .. గుర్రాలు మామూలే. ఈ కారణంగానే ఈ సినిమా కోసం భారీస్థాయిలో ఖర్చు చేయనున్నట్టుగా తెలుస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన పెట్టుబడిని .. లాభాలతో కలిపి రాబట్టుకోవడం పెద్ద కష్టమేం కాదని అంటున్నారు. పవన్ సరసం నాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. జాక్విలిన్ ఫెర్నాండేజ్ ఒక కీలకమైన పాత్రలో మెరవనుండగా, పవన్ ను ఆరాధించే ఓ గిరిజన యువతిగా ప్రగ్యా జైస్వాల్ కనిపించనుందని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Must Read ;- జూన్ నుంచి పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం











