అది.. 2019.. ఫిబ్రవరి 14.. సమయం.. మధ్యాహ్నం 3 గంటలు.. జమ్మూ నుంచి శ్రీనగర్ కు 78 ఆర్మీ వాహనాలు బయలుదేరాయి. 44వ నెంబరు జాతీయ రహదారిపై వరుసగా వెళుతున్నాయి. వాటిలో 2,500 మంది సైనికులు ఉన్నారు. సెలవులు ముగించుకుని ఇంటి దగ్గర నుంచి బరువెక్కిన హృదయాలతో బయలుదేరిన వాళ్లు.. మరి కాసేపట్లో విధుల్లో చేరబోతున్న వేళ.. సహచరులతో ముచ్చట్లాడుతూ.. అయిన వాళ్ల మీద బెంగను వీడేందుకు యత్నిస్తున్నారు. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ.. దేశ సేవకు పునరంకితమయ్యేందుకు సరిహద్దుకేసి వెళుతున్నారు. తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు గుర్తుకొస్తున్నా.. ఆ బాధను గుండె మాటున అదిమిపెట్టి.. దేశ రక్షణకై సాగుతున్నారు. ఇంటి కన్నా.. దేశం ముఖ్యం అనే ఒకే ఒక్క భావన స్ఫూర్తి రగుల్చుతుండగా.. తల్లి రక్షణకై కదులుతున్నారు.
సిద్దమైన ఉగ్రమూకలు..
మరోవైపు పక్కా సమాచారం అందుకున్న ఉగ్రమూకలు అదను కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంటెలిజెన్స్ కన్నుగప్పి.. పుల్వామా జిల్లా.. లాథ్పోరా వద్ద కాపు కాచాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ మానవ బాంబును సిద్ధం చేశాయి. అది కూడా ఎవరో కాదు.. ముష్కరుల విధ్వేషపూరిత ప్రసంగాలకు ఆకర్షితుడైన ఓ అమాయక కశ్మీరీ యువకుడు. అక్కడ స్థానికుడు. తమను కంటికి రెప్పలా కాపాడుతున్న సోదరులపైకే తాను కత్తిదూస్తున్నానన్న విషయం ఆ సమయంలో అతడికి తెలియదు. తెలిసిన వాళ్లు చెప్పినా.. వినే స్థితిలో అతడు లేడు. ఆ ఉగ్రమూక విధ్వేషాగ్నికి సమిధలా మారిన ఆ యువకుడి పేరు ఆదిల్ అహ్మద్ దార్.

ఉగ్రదాడికి నేలకొరిగిన 40 మంది సైనికులు..
తమ వెనుక జరుగుతున్న ఈ కుట్ర గురించి ఏమాత్రం తెలియని మన సైనికులు.. ఆట పాటలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా సరిహద్దు దిశగా కదులుతున్నారు. ఆత్మీయులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ.. ఆ అనుభూతులను.. మరోసారి వెళ్లే వరకు చెదరకుండా ఉండేలా పదిలపరుచుకుంటూ.. ముందుకెళుతున్నారు. సూర్యాస్తమయంలోగా గమ్యం చేరేలా.. ఒకదాని వెనుక ఒకటిగా 78 వాహనాలు వేగంగా వెళుతున్నాయి. సమయం 3:30 గంటలు. ఉగ్రమూక కాపుకాచిన ప్రదేశానికి వాహనాలు చేరుకున్నాయి. అంతే.. ఒంటినిండా బాంబులు ధరించి, మనసు నిండా కరడుగట్టిన విషాన్ని నింపుకున్న ఓ ఉగ్ర ప్రేరేపిత యువకుడు.. ఒక్కసారిగా కారుతో ఆ వాహన శ్రేణిపై విరుచుకుపడ్డాడు. అంతే.. భారీ విస్పోటనం. కన్నుమూసి తెరిచేలోగా 40 మంది జవాన్లు అమరులయ్యారు. దేశ సేవ కోసం బయలుదేరిన భరతమాత ముద్దుబిడ్డలు నేలకొరిగారు. ఛిద్రమైన దేహాలు.. చిందరవందరగా పడిపోయాయి. అనేక మంది గాయపడ్డారు. ఆ ప్రాంతమంతా మరుభూమిలా మారింది. వాతావరణం ఎర్రటి మంచు దుప్పటి కప్పుకుంది.
40 కుటుంబాలు.. 130 కోట్ల గుండెల్లో తీవ్ర విషాధాన్ని నింపిన ఈ ఘటన.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వం.. పాక్ పై ప్రతాకారంతో రగిలిపోయింది. ఉగ్ర పుట్టిల్లు పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించింది. భారత్ అంటేనే భయంతో ఒణికేలా చేసింది. శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ వందలాది ముష్కరులను మట్టుబెట్టింది. భారత్ జోలికొస్తే.. తమ దేశమూ తమకు సురక్షితం కాదని నిరూపించింది. పాక్ తో అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలను పూర్తిగా తెంచి వేసింది. దేశమంతా ఒక్కటై.. అమరవీరులకు అశ్రు నివాళి అర్పించింది.

1989 తర్వాత ఇదే..
ఈ ఘటన..1989 తర్వాత భారత సైన్యంపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడిగా నిలిచిపోయింది. దీనికి బాధ్యులం తామేనంటూ.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ ప్రకటించుకుంది. ఈ ఆత్మాహుతి దాడికి సమిధలా మారిన కశ్మీరీ యువకుడు ఆదిల్ (22)కు అంతకు ఏడాది క్రితం వరకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలూ లేవని, 2018 మార్చి తర్వాత కనిపించకుండా పోయాడని అతడి తల్లిదండ్రులు.. దర్యాప్తు బృందానికి తెలిపారు. బహుశా.. ఆ తర్వాతే ఉగ్రవాదుల మాయలో చిక్కుకుని ఉంటాడని, ఏడాది కాలంపాటు అతడికి ఈ దాడికి సంబంధించి శిక్షణ ఇచ్చి ఉంటారని దర్యాప్తు బృందం తెలిపింది. ఉగ్రవాదుల మాటల పట్ల అమాయక కశ్మీరీ యువత అప్రమత్తంగా ఉండాలని, జీవితాలు పాడు చేసుకోవద్దని కోరింది.
దేశం కోసం పుట్టి, దేశం కోసం బతుకుతూ.. దేశ సేవలోనే కన్నుమూసిన ఈ అమరవీరులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కనీస ధర్మం.
https://www.youtube.com/watch?v=3mXUG5VlRqE










