ఆరోపణలు చేయడం… ఆనక తూచ్ అనడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమై పోయింది. తెరవెనుక ఏంజరిగిందో ఏమిటో తెలియదుగానీ 139 మంది గత కొన్నేళ్లుగా తనపై అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన యువతి గళం మార్చేసింది. యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు.. ఇంకా ఇలాంటివారు ఎందరో హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకోవచ్చు. తను ఎవరెవరిపై కేసులు పెట్టానో వారందరికీ క్షమాపణలు చెబుతున్నానంటోంది. ఇప్పుడు కథ డాలర్ బాయ్ వైపు మళ్లింది.
ఈ రోజు ఆమె ప్రెస్ పెట్టి ఈ డాలర్ బాయ్ పై ఆరోపణలు గుప్పించింది. ఈమె చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆమె సడన్ ఈరోజు మీడియా ముందు ప్రత్యక్షమై ప్రదీప్, కృష్ణుడు లాంటి వాళ్లకు ఏ పాపమూ తెలియదని నొక్కి వక్కాణిస్తోంది. తనను డాలర్ బాయ్ బెదిరించి అలా చెప్పించాడని ఆమె అంటోంది. ఉద్యోగం పేరుతో తనను మభ్యపెట్టి డాలర్ బాయ్ తనను మోసం చేశాడని, చిత్రహింసలకు గురిచేశాడని ఆరోపిస్తోంది.
కొన్ని నెలలుగా కొంతమంది ఆ యువతిని తమ అదుపులో పెట్టుకుని ఆమె ద్వారా డబ్బు సంపాదించేందుకు కుట్రపన్నినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు కనిపించలేదు. ఇప్పుడు ఆమె చెబుతున్న మాటల్ని బట్టి చూస్తుంటే ఆమె డాలర్ బాయ్ అదుపులోనే ఇప్పటిదాకా ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
డాలర్ బాయ్ ఎక్కడ?
డాలర్ బాయ్ అలియాస్ రాజా శ్రీకర్ రెడ్డి ఎక్కడనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఆమె మీడియా ముందుకు వచ్చిన నేపథ్యంలో సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన డాలర్ భాయ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలించి ఎట్టకేలకు పట్టుకున్నట్లు తెలుస్తోంది. డాలర్ భాయ్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న అమ్మాయిల డాక్యుమెంట్లు ఎవరివన్న దానిపైనా పోలీసులు దృష్టిపెట్టారు.
139 మంది అత్యాచారం చేశారన్న కేసులో డాలర్ బాయ్ వ్యవహారం పై సీసీఎస్ పోలీసులు మరింతగా ఆరా తీస్తున్నారు. సోమాజీగూడలోని ది గాడ్ పవర్ ఫౌండేషన్‌లో సోదాలు చేసి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుని ఆ కార్యాలయాన్ని సీజ్ చేసినట్లు తెలిసింది. డాలర్ బాయ్ పట్టుబడితే ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు, మరికొందరు వ్యక్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆమె వాయిస్ మార్చిన నేపథ్యంలో కూడా దీని మీద భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.