ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి బాలకృష్ణ తన మార్క్ చికిత్సను సూచించాడు. మనోధైర్యం వుంటే కరోనాను ఎదురుకోవచ్చని బాలయ్య తెలిపారు. కరోనాకు భయపడి కొందరు ఆత్మహత్య చేసుకున్నారని అలా ఎవరూ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనాకు వైద్యంతో బాటు వేదాలు, మంత్రాలు ఉన్నాయని బాలకృష్ణ పేర్కొన్నారు. కరోనా పోవాలంటే నారాయణ మంత్రం చదవాలని ప్రజలకు హితువు పలికారు. స్వయంగా లలిత త్రిపుర సుందరి మంత్రాన్ని చదివి వినిపించారు. వైద్యంతో పాటు స్తోత్రాలతో కరోనాను ఎదురుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.
మనకు కరోనా అంటలేదని మానసికంగా సన్నద్ధం కావాలని ధైర్యాన్ని నూరిపోశారు. అలా అయితే జబ్బు కూడా దగ్గరికి రాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓం స్వాహా చదువుకోవాలని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ వీటిని చెప్పేటప్పుడు బాలకృష్ణ మాస్క్ పెట్టుకోవడమే గాక ఫేస్ షీల్డ్ పెట్టుకున్నారు. నమ్మకంగా విరుగుడు మంత్రం చెప్పిన బాలయ్యకు అంత అపనమ్మకమా? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మనోధైర్యాన్ని నూరిపోసిన బాలయ్య ధైర్యం ఏమైందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇంతకూ బాలయ్య ఈ మంత్రం చదువుతున్నాడా? లేదా? అని నెటిజన్స్ అడుగుతుండటం గమనార్హం. దీనికి సంబందించిన వీడియోని నెటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.