వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి మాటలు చూస్తుంటే.. పెద్దలు చెప్పిన సామెత ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ ఠక్కున గుర్తుకు వస్తోంది. ఎందుకంటే.. మొన్నటిదాకా సోషల్ మీడియాలో ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సాయిరెడ్డి.. ఇటవలి కాలంలో అసలు కనిపించడమే మానేశారు. సాయిరెడ్డి సైలెన్స్ కు కారణమేంటో తెలియదు గానీ.. ఏ పార్టీకి చెందిన ఏ నేత తమ ప్రత్యర్థులపై విరుచుకుపడినా ప్రతి ఒక్కరికి ఆయనే గుర్తుకు వచ్చే పరిస్థితి. నారా లోకేశ్‌ను అయితే ఇష్టారాజ్యంగా దూషిస్తూ ట్వీట్లు చేసిన సాయిరెడ్డి.. వైరి వర్గం నుంచి కూడా అదే రీతిలో ట్రోలింగ్‌కు గురైన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు సాయిరెడ్డిని ఇంతగా ఎందుకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందన్న విషయానికి వస్తే.. టీడీపీ కార్యాలయంపై దాడి, దానికి నిరసనగా చంద్రబాబు దీక్ష, బాబు దీక్షకు పోటీగా వైసీపీ దీక్షలు జరుగుతున్న సమయంలో సాయిరెడ్డి నోట చిలక పలుకులు వినిపించాయి. మొన్నటిదాకా ఓ రేంజిలో విరుచుకుపడిన సాయిరెడ్డి ఇప్పుడు చిలుక పలుకులు పలికతే ఆయనను గుర్తు చేసుకోక తప్పదు కదా.
సాయిరెడ్డి చిలుక పలుకులు ఇవే
ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరిట చంద్రబాబు చేపట్టిన దీక్షకు పోటీగా వైసీపీ మొదలెట్టిన జనాగ్రహ దీక్షల్లో భాగంగా విశాఖలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన దీక్షకు సంఘిభావం చెప్పేందుకు వచ్చిన సాయిరెడ్డి తనదైన శైలి కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమంటారంటే.. ‘‘విమర్శలు ప్రజాస్వామ్య సహితంగా ఉండాలి. అసహ్యకరమైన భాష వాడకూడదు. టీడీపీ దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సీఎంను అసభ్యకరంగా దూషించడం శోచనీయం. లోకేష్ కూడా దారుణంగా ట్వీట్లు పెడుతున్నారు’’అంటూ సాయిరెడ్డి తనదైన శైలిలో మదనపడిపోయారు. జనానికి, రాజకీయ నేతలకు సూక్తులు వల్లించారు. గతంలో ఓ రేంజిలో విమర్శలు సంధించిన సాయిరెడ్డి నోట ఈ వ్యాఖ్యలు వచ్చినంతనే.. వైసీపీ నేతలు కూడా ఆయన వైపు అలా చూస్తూండిపోయారు.
సభ్యత లేని నాయకుడెవరు?
సభ్యత, సంస్కారం లేని నాయకుడిగా ఇప్పటి వరకూ సాయిరెడ్డి నిలిచిన వైనం తెలిసిందే. ట్విట్టర్లో కానీ బయట కానీ ఆయన మాట్లాడే మాటలు అత్యంత దారుణంగా ఉంటాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ట్వీట్ పెట్టినా కొన్ని వందల మంది ఆయన తీరును తప్పు పడుతూ కామెంట్లు పెడుతూ ఉంటారు. చివరికి చంద్రబాబు పుట్టిన రోజున కూడా శుభాకాంక్షల పేరుతో వ్యక్తిగత లోపాలను ఎత్తి చూపించి ట్వీట్లు పెట్టే కుసంస్కారం సాయిరెడ్డి సొంతమనే చెప్పాలి. అలాంటి సాయిరెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడానికి బయలుదేరి రావడం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేదేనని చెప్పాలి. మొన్నటిదాకా ప్రత్యర్థులపై అసభ్యకర ట్వీట్లతో విరుచుకుపడిన సాయిరెడ్డి.. ఏమైందో కానీ ఇటీవలి కాలంలో మీడియా ముందుకు రావట్లేదు. చంద్రబాబు, లోకేశ్‌ను తొగడటం మాని జగన్ ను పొగుడుతూ ట్వీట్లు పెడుతున్నారు. పార్టీలో ఆయనకు ప్రాధాన్యం తగ్గిందని అందుకే ఆయన ఇలా రూట్ మార్చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా కానీ.. దారుణమైన భాషకు ట్విట్టర్లో ఓ బ్రాండ్‌గా మారిన సాయిరెడ్డి తాజాగా నీతులు వల్లిస్తున్న తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.