ఐదేళ్లుగా తిరోగమనంలో ఉన్న పెట్టుబడులను తిరిగి గాడిలో పెట్టి, వేగం పుంజుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేసి తరిమేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీలో బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. పారిశ్రామికవేత్తలు భయపడాల్సిన పనే లేదనే కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. పరిశ్రమలశాఖ అధికారులతో సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష చేశారు. పెట్టుబడులు వేగం పుంజుకోవడానికి ఈ సమీక్షలో కీలక నిర్ణయాలెన్నో తీసుకున్నారు.
తక్షణం ఐదు పాలసీలను వచ్చే 100 రోజుల్లోనే రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. దాని ద్వారా పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4 పారిశ్రామిక క్లస్టర్లు ఉండగా, మరో 4 క్లస్టర్లు కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి.. కేంద్ర ఆనుమతులు పొందేందుకు త్వరగా ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలకు 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లించామని అధికారులు తెలిపారు. అదే వైసీపీ ప్రభుత్వం 34 శాతమే చెల్లించిందని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, దాంతో పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు.
జగన్ వేధింపుల కారణంగా వెనక్కి పోయిన పారిశ్రామికవేత్తలతో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరమైతే తాను కూడా వారితో మాట్లాడతానని చంద్రబాబు చెప్పారు. పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేసేలా చూడాలని ఆదేశించారు. ఏడాదిలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తిచేసి 1,36,260 మందికి ఉపాధి కల్పించాలని చంద్రబాబు నిర్దేశించారు. సమీక్ష తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కీలక వివరాలను కూడా వెల్లడించారు.
బీపీసీల్ రూ.70 వేల కోట్లు, మరో కంపెనీ రూ.75 వేల కోట్లతో ఏపీకి రాబోతోందని తెలిపారు. ఆ రెండో కంపెనీ పేరు తాను చెప్పబోనని.. చెప్తే తమిళనాడు వాళ్ళు తీసుకెళ్తారని అన్నారు. 90 రోజులకు చంద్రబాబు నాయుడు కంపెనీ పేరు ప్రకటిస్తారని చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు చెప్పిన 5 పాలసీల్లో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్‌టైల్స్ పాలసీ ఉన్నాయని తెలిపారు.











