జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా ఆయనకు గిట్టని వారిపై రకరకాల కేసులు పెట్టి వేధించిన వారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. వీరు జగన్ మోహన్ రెడ్డి కాళ్లు పట్టే పని ఒక్కటే చేయలేదు. మిగతా అన్ని విషయాల్లోనూ జగన్ ను సంతోష పెట్టేలాగా గత ఐదేళ్లుగా వ్యవహరించారు. ముఖ్యంగా 2023 సెప్టెంబరులో అప్పటి విపక్ష నేత చంద్రబాబును జగన్ కనుసన్నల్లోనే వీరిద్దరూ ముప్పుతిప్పలు పెట్టారు. అసలు కేసులు ఏమీ లేకపోయినా క్రియేట్ చేసి మరీ అరెస్టు చేయించారు.
డమ్మీ కేసులు పెట్టి, అవి నిజమని నమ్మించేలా ఢిల్లీకి వెళ్లి ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టేవారు. అందుకు ఖర్చయ్యే రూ.కోట్ల సొమ్ము మొత్తం ప్రజలదే. దీంతో వీరిద్దరూ జగన్ కు జంట కవులని.. జగన్ ప్రత్యర్థులను వేధించడానికి తరచూ కచేరీలు పెడుతుంటారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు. అప్పట్లో కేవలం తమ బాస్ ఆదేశాల మేరకు పని చేసి.. వివిధ మార్గాల్లో బాగా లబ్ధి కూడా పొందారు. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరిపై అంటే వారిమీద ఏవో ఒక కేసులు తోసేసి.. ఆడుకున్నారు.
ఇప్పుడు ఈ ఇద్దరు జంట కవుల పాపం పండింది. సంజయ్, పొన్నవోలు ఇద్దరూ నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వం సమాధానం ఇస్తే.. చర్యలు ఏం తీసుకున్నారని కోర్టు ప్రశ్నిస్తుంది. అందుకే అక్కడిదాకా రాకుండా ప్రభుత్వం ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది. పెట్టిందే తప్పుడు కేసులు.. పైగా హైదరాబాద్, ఢిల్లీలకు వెళ్లి ఖరీదైన హోటళ్లలో ప్రెస్ మీట్లు. ఎంత హై ప్రొఫైల్ కేసులు అయినా సీఐడీ చీఫ్‌లు, ఏఏజీలు ఇలా వ్యవహరించరు. మొత్తం ప్రజాధనం దుర్వినియోగం చేశారు. అసలు కోర్టులో ఉన్న కేసుల మీద ఇలా ప్రెస్ మీట్లు పెట్టడమే నిబంధనలకు విరుద్ధం. ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ పై ఈ కారణంతో కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఆయనపై కేసులు పెట్టి అరెస్టు కూడా చేయడానికి వీలుంటుంది. సర్వీసులో ఉండగా ఆయన చేసిన పాపాలకు అవి తక్కువేనని ఆయన నిర్వాకాల గురించి తెలిసిన ఎవరైనా చెబుతుంటారు.
ఇక వన్ వే టిక్కెట్ గా పేరు పొందిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఇప్పుడు ఏఏజీ పదవిలో లేరు. కానీ ఆయన ప్రభుత్వ పదవిలో ఉన్నప్పుడు చాలా తప్పులు చేశారు. అప్పుడు చేసినందుకు ఇప్పుడు ఎలాంటి శిక్షలకు గురవుతారో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ జంట కవుల్లో మాత్రం అడ్డంగా దొరికిపోయేది సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు.










