చంద్రబాబు సీఎం అయ్యాక సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇంతవరకూ జరగని రీతిలో రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా బీసీ వర్గానికి చెందిన ఒక లాయర్ ను రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చంద్రబాబు నియమిచారు. న్యాయవాది మెండ లక్ష్మీనారాయణను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమిస్తూ న్యాయశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి సునీత ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ఈ పదవిలో చూడలేదు.
గతంలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు హైలెవల్ పోస్టుల భర్తీలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది.. టీడీపీ ప్రభుత్వం. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. పోలినాటి వెలమ (బీసీ) సామాజికవర్గానికి చెందిన మెండ లక్ష్మీనారాయణను కీలకమైన పోస్టులో తాజాగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో ప్రాసిక్యూషన్లు, క్రిమినల్ కేసుల అప్పీళ్ల విచారణ, లాంటి కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో లక్ష్మీనారాయణ వాదనలు వినిపించనున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని చిన్నతుంగం పంచాయతీ పరిధిలోని కృష్ణచంద్రాపురానికి చెందిన వారు లక్ష్మీ నారాయణ. పేద కుటుంబంలో పుట్టి ప్రస్తుతం పీపీ స్థాయికి ఎదిగారు.
పీపీ మాత్రమే కాక, హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడం కోసం మరో 14 మంది న్యాయవాదులను అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదులు (ఏజీపీ)గా ప్రభుత్వం నియమించింది. జులై 3న 14 మందిని నియమించారు. మొత్తం 28 ఏజీపీలలో 17 మంది అంటే 61 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారినే టీడీపీ ప్రభుత్వం నియమించింది. ఏజీపీలుగా కొత్తగా నియమితులైన వారిలో మేకల అనూష, షహీన ఖాతూన్, ఆర్.సూర్యనారాయణ, సంధ్యదీప్తి, కొరిబిల్లి సందీప్, మొర్తా శ్రీనుబాబు, తుంగల రఘుప్రసాద్, ఆర్‌ఎస్ మణిధర్ పింగళి, అరువ రఘురాం, సీహెచ్.శాంసన్, జె.కృష్ణ ప్రణీత్, కాటా సాంబశివరావు, శ్రీనివాస్ పాతూరి, అప్పసాని వినీత్ ఉన్నారు. వీరిలో ఏజీపీలకు నెలకు రూ.44 వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. వీరు ఏజీ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తారు. బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుంచి మూడేళ్ల పాటు పోస్టులో ఉంటారు.











