గత సీజన్‌ను కరోనా ముంచేసింది. ఈ సీజన్‌నూ వెంటాడింది. పది నెలల తర్వాత పోటీల బరిలోకి దిగిన భారత క్రీడాకారులకు పునరాగమనం చేదు అనుభవాన్నే మిగిల్చింది. బ్యాంకాక్‌లో జరిగిన రెండు థాయ్‌లాండ్ ఓపెన్‌లలో భారత స్టార్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఏడాది ఆరంభంమే భయపెట్టడంతో ఆటగాళ్లలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని అందరూ ఆందోళన చెందారు. కానీ ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ అర్హత సాధించారు. నేటినుంచి జరగబోయే ఫైనల్లో విజయం సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
నేటినుంచి మెగా టోర్నీ…
బ్యాంకాక్ వేదికగా జరగబోయే వరల్డ్ టూర్ ఫైనల్స్ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో తలపడేందుకు భారత స్టార్ షట్లర్లు, తెలుగు క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సిద్ధమయ్యారు. ఈనెల 27 నుంచి 31 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. కరోనా కారణంగా గతేడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితం థాయ్‌లాండ్ ఓపెన్ రెండు సూపర్–1000 టోర్నీలతో అంతర్జాతీయ సీజన్ పునః ప్రారంభమైంది.సమరానికి సింధు, శ్రీకాంత్ సిద్ధం…
కరోనా కారణంగా 10 నెలలు అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉన్న భారత క్రీడాకారులకు పునరాగమనం చేదు అనుభవాన్నే మిగిల్చింది. బ్యాంకాక్‌లో జరిగిన రెండు థాయ్‌లాండ్ ఓపెన్‌లలో భారత స్టార్లు ఘోరంగా విఫలమయ్యారు. రెండు టోర్నీల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సింధు, శ్రీకాంత్‌లు ప్రపంచ టూర్ ఫైనల్స్‌లో సత్తాచాటాలని భావిస్తున్నారు.సానుకూలమేంటి.. ప్రతికూలమేంటి?
మహిళల సింగిల్స్ గ్రూప్-బిలో సింధుకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), ఇంతానన్ రచనోక్ (థాయ్‌లాండ్), పోర్న్‌పావీ (థాయ్‌లాండ్)లతో సింధు ఒక్కో మ్యాచ్ ఆడనుంది. రౌండ్ రాబిన్ లీగ్ అనంతరం గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణులు సెమీస్‌కు అర్హత సాధిస్తారు. ఒకే గ్రూప్‌లో తై జు, రచనోక్ ఉండటం సింధుకు ప్రతికూలాంశం. ఇప్పటి వరకు తై జు, సింధులు 17 సార్లు తలపడగా.. 12 మార్లు ప్రత్యర్థిదే పైచేయి అయింది. సింధు అయిదు సార్లు మాత్రమే తై జుపై నెగ్గింది. రచనోక్‌కు 5-4తో సింధుపై మెరుగైన రికార్డుంది. గత కొంతకాలంగా లండన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సింధు ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్‌తో సత్తాచాటేందుకు సై అంటోంది.