ఉన్నదానితోనే వేగలేక చస్తుంటే.. ఏదో కొత్తరకం కరోనా విజృంభిస్తుండడంతో బ్రిటన్ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలే కరోనా దాటికి ప్రపంచం కుదేలైపోయింది. తగ్గుతుందిలే అనుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ పేరుతో ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉండడంతో ప్రజలు భయపడిపోయారు. అది కాస్త తగ్గుతుందిలే అనుకుంటున్న ఈ సమయంలో కరోనా సరికొత్త రకం బీభత్సం సృష్టిస్తున్నట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కొత్త రకం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో లాక్ డౌన్‌నే ఆశ్రయించారు.

వారంగా కొత్త వైరస్ కలకరం
కరోనాలోకి కొత్తరకం వైరస్ మూలాలు తెలియలేదని ప్రభుత్వం వెల్లడించింది. అసలిదెలా దేశంలోకి అడుగుపెట్టిందో అర్థం కాక అధికారులు సైతం బెంబేలెత్తిపోతున్నారు. దాన్ని నివారణ సంగతి పక్కన పెడితే, అసలెలా నియంత్రించాలో అర్థం కావడంలేదంటున్నారు అధికారులు. ప్రస్తుతం కనిపెట్టిన టీకాలు ఈ కొత్తరకం కరోనాపైన పనిచేస్తాయా లేదా అనేది ఇంకా తెలియదని చెప్తున్నారు ప్రభుత్వ అధికారులు. గత వారంగా నమోదవుతున్న కేసుల్లో 60 శాతంకి మించి కొత్త రకం వైరస్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
మళ్లీ లాక్ డౌన్
పూర్తి లాక్ డౌన్ ప్రకటించకుండా.. కొన్న సడలింపులతో కూడిన లాక్ డౌన్‌ని ప్రకటించింది ప్రభుత్వం. రానున్నది క్రిస్మస్ కావడంతో ప్రజలు తమకు కావల్సిన వారిని కలుసుకునే అవకాశాలు ఉండవని నిరాశ చెందుతున్నారు. ఈ సారి క్రిస్మస్ వేడుకలు చాలా జాగ్రత్తగా, కరోనా నిబంధనల మేరకు మాత్రమే జరుపుకోవాలని ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. కొత్తరకం స్ట్రెయిన్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతున్న మాట నిజమే కానీ.. కరోనా కంటే ప్రమాదమా, ప్రాణాంతకమా అనే దానికి ఇంకా ఎటువంటి రుజువులు లేవని ప్రభుత్వ అధికారులు ప్రకటన విడుదలు చేశారు. ఈ దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారని, తొందరలోనే అవగాహాన లభిస్తుందని, అప్పటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు ఉల్లంఘించకుండా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని అధికారులు ప్రజలను కోరారు.











