ఈ విశ్వంలో కోటానుకోట్ల గ్రహాలు ఉన్నప్పుడు ఒక్క సూర్య కుటుంబంలోనే మానవాళి ఎందుకు ఉంది?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మానవాళికి సమాధానం దొరకడం లేదు. త్వరలోనే దీనికి సమాధానం దొరికే అవకాశం త్వరలోనే వస్తుందన్న సంకేతాలు కూడా అందుతున్నాయి.
ఏలియన్స్ ఉన్న మాట నిజమేనన్న వాదన వినిపిస్తోంది. రెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ బాస్ హైమ్ ఇషెద్ మాటలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఏలియన్స్ గురించి ట్రంప్ కు కూడా తెలుసన్నారు. తన మాటలను ఆయన ఉపసంహరించుకున్నారు. ఏలియన్స్ విషయాన్ని ఇలా బహిరంగ పర్చడం గ్రహాంతర వాసులకు ఇష్టం లేదని, అందుకే తన మాటలను ఉపసంహరించుకుంటున్నానని ఆయన ప్రకటించారు. మన పాలపుంతలో మన సూర్యుడు ఓ చిన్న నక్షత్రం మాత్రమే. ఇలాంటి నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి. వాటిలో కూడా గ్రహ కుటుంబాలు ఉండటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాకపోతే అక్కడి నాగరికత ఎలా ఉంటుంది? ఏలియన్స్ ఉన్నట్లియితే వాటి రూపు రేఖలు ఎలా ఉంటాయి? లాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని కనుక్కోవడం అంత తేలిక కాదు. ఈ ఏలియన్స్ ను కనుక్కునేంత టెక్నాలజీ మన దగ్గర లేదు. గ్రహాంతర వాసులను కనుక్కోవాలంటే ఆ సంకేతాలను టెక్నోసిగ్నేచర్స్ అంటారు. ముఖ్యంగా రేడియో ఫ్రీక్వెన్సీ ఇందులో కీలక పాత్ర వహిస్తుంది. ఆ టెక్నో సిగ్నేచర్స్ కోసం అన్వేషణ సాగాలి. వేలాది కాంతి సంవత్సరాల నుంచి వెలువడే సంకేతాలను మనం అందుకుని విశ్లేషించగలగాలి.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జీన్-లూక్ మార్గోట్ ఏంజిల్స్ సైన్స్ అలర్ట్కు చెప్పిన వివరాల ప్రకారం 400 కాంతి సంవత్సరాల దూరంలోని సిగ్నల్స్ ను అరేసిబో ప్లానెటరీ రాడార్ గుర్తిస్తుందట. దీనికన్నా వెయ్యి రెట్లు శక్తిమంతమైన ట్రాన్స్ మిటర్లు కూడా అవసరం. వెస్ట్ వర్జీనియాలోని శక్తివంతమైన రేడియో టెలిస్కోప్ గ్రీన్ బ్యాంక్ ను ఉపయోగించి మార్గోట్, అతని బృందం ఇటీవల టెక్నోసిగ్నేచర్ల కోసం అన్వేషించారు. 2018, 2019 ఏప్రిల్‌లో మొత్తం నాలుగు గంటలపాటు పరిశీలించారు. అలా వారు గెలాక్సీ చుట్టూ 31 సూర్యుడిలాంటి నక్షత్రాల వైపు దృష్టి సారించారు.
మొత్తం 26,631,913 టెక్నోసిగ్నేచర్ లను గుర్తించారు. వాటిని విశ్లేషణ చేయగలిగితే గ్రహాంతర వాసులను గుర్తించడంలో మనం ముందడుగు వేసినట్టే. ఈ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తేలితే ఏలియన్స్ చిక్కుముడి విడిపోతుంది. సాధారణంగా ఇలాంటి పరిశోధనలో అనుమానిత గ్రహ వ్యవస్థల నుంచి టెరాబైట్ల డేటాను సేకరిస్తారు. గ్రహాంతర వాసుల సంకేతాల జాడ కనుక్కోవడానికి అరెచిబో పరిశోధన కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోంది. అలాగే ఎర్త్ స్పీక్స్ పనిచేస్తున్న ప్రాజెక్టులో 70 దేశాలకు చెందిన రెండు వేలమంది పనిచేస్తున్నారు. వీరంతా గ్రహాంతర వాసుల సిగ్నల్స్ ను అందుకునే పనిలో ఉన్నారు.
ఎగిరే పళ్లాలు ఉన్నాయా?
గ్రహాంతర వాసుల ఉనికి నిజమైతే ఎగిరే పళ్లాల ఉనికి కూడా నిజమైనట్టే. వీటిని యూఎఫ్ఓలు అని పిలుస్తున్నారు. టెక్సాస్ లో వీటికి సంబంధించి పెద్ద చరిత్రే ఉంది. ఇక్కడ 1878 నుంచి UFOలను చూస్తున్న సమాచారం ఉంది. 1897లో మొదటిసారిగా వాటిని తాకినట్టు చెబుతున్నారు. సిగార్ ఆకారంలో ఉండే క్రాఫ్ట్ ను మిడ్ వెస్ట్ లో కనుగొన్నారు. దీని గురించి 1969లోనే ఓ పత్రికలో వ్యాసం వచ్చింది. 1897లో ఓ UFO కూలిపోగా అందులోని గ్రహాంతరవాసి మృతదేహాన్ని స్మశాన వాటికలో ఖననం చేశారంటారు. UFO లకు హాట్ బెడ్ గా తూర్పు టెక్సాన్ ను పిలుస్తారు. కొందరు వీటిని వీడియోలలో కూడా బంధించారు.
మన దగ్గర UFO లకు సంబంధించిన సమాచారం 150 సంవత్సరాల నుంచి ఉన్నా గ్రహాంతర వాసుల ఉనికిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో అర్థం కావడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఇజ్రాయెల్ స్పేస్ సెక్యూరిటీ మాజీ బాస్ హైమ్ ఇషెద్ చెప్పిందే నిజమన్న అనుమానం కూడా కలుగుతోంది. అసలు గ్రహాంతర వాసుల్ని కలిస్తే వారి దగ్గర ఈ విశానికి సంబంధించిన బోలెడు సమాచారం ఉండి ఉంటుంది. హ్యూస్టన్ క్రానికల్, కెల్లర్‌లోని కొందరు సిగరెట్ ఆకారంలో ఉన్న గ్రహాంతర వస్తువులను గుర్తించారు. దాన్ని చిత్రీకరించారు కూడా. ఇలా అనేక సందర్భాల్లో UFOల ఉనికి తెలిసింది. 2004, 1014 మధ్య UFO లను చూసిన నేవీ పైలట్లు ఆ తర్వాత అన్ ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా (యూఏపీ) టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది.
వారితో స్నేహం ప్రమాదకరమా?
గ్రహాంతరవాసులతో మనం సంబంధాలను అది ప్రమారకరమా? ఇది ఓ డేంజరస్ గేమ్ గా స్టీఫెన్ హాకింగ్ అంటుంటారు. ఏలియన్స్ గనుక ఇక్కడికి వస్తే వారు ఈ భూమిని ఆక్రమించుకుంటారని ఆయన అంటుంటారు. కాబట్టి వారితో మనకు పొత్తు ఉండాలా లేదా అన్నది మాత్రం ఇప్పటికిప్పుడు నిర్ణయించలేం. ఎందుకంటే వారు మనకన్నా ఎంత శక్తిమంతులో మనకు తెలియదు. కాబట్టి వారు ఆడించినట్లు మనం ఆడక తప్పదు. వారు నాన్ వెజిటేరియన్లయితే మనుల్ని ఆహారానికి ఉపయోగించుకున్నా మనం ఏమీ చేయలేం.
మనం మనకన్నా బలహీనమైన జంతువులను భుజించినట్టే అనుకోవాలి. అందుకే స్టీఫెన్ హాకింగ్ లాంటి వారు ముందే హెచ్చరిస్తున్నారు. మనకు తెలిసిన సమాచారాన్నంతటినీ పరిశీలిస్తే అతి త్వరలోనే గ్రహాంతర వాసులు మన ముందుకు వచ్చేస్తారేమో అనిపిస్తోంది. వారితో తేడా వస్తే గనుక ఈ భూమ్మీద జనమంతా మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్దం కావాల్సి వస్తుందేమో. అలా ఏమీ జరగకుండా కథ సుఖాంతమైతే లోకకళ్యాణమే.
– హేమసుందర్ పామర్తి