‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు…కడివెడైననేమి ఖరము పాలు’ అని వేమన చెప్పిన శతకం చిన్నప్పుడే నేర్చుకొని ఉంటాం. మంచి ఆవు పాలు కొన్ని ఉన్నా చాలు. గాడిద పాలు ఎన్ని ఉన్నా ఆవు పాలకు సమానం కావనే ఉద్దేశంతో మనం ఆవు పాలు తాగుతూ ఉన్నాం. రోజులు మారే కొద్దీ అభిరుచులు, పద్ధతులు మారుతున్నట్లు ప్రస్తుతం గోవు పాల కంటే ఖరము పాలు మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా, హిస్సార్ లోని నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్ లో ఈ డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ డైరీ ఇప్పటికే గుజరాత్ కు చెందిన 10 హాలారి గాడిదలను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చారు. హాలారి గాడిదల పాలల్లో ఆవు పాల కంటే ఎన్నో రెట్లు ఔషధ గుణాలు ఉంటాయని రీసెర్చ్ సెంటర్ అధికారులు కూడా చెబుతుండటం గమనార్హం.
ఆవు, గేదె పాల ద్వారా చిన్న పిల్లలు అప్పుడప్పుడూ అలెర్జి బారిన పడతారని కానీ హాలారి గాడిద పాలు తాగితే ఎటువంటి సమస్యలు ఉండవని వైద్యాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలు రోగ నిరోధక శక్తిని పెంచడమే గాక ఎన్నో జబ్బులకు గాడిద పాలు ఔషధంగా పని చేస్తాయని వారు తెలిపారు. ప్రస్తుతం కరోనా నెలకొన్న పరిస్థితులలో గాడిద పాలు దివ్య ఔషధంగా పని చేస్తాయని భరోసా ఇస్తున్నారు. నిపుణులు చెబుతున్న మేరకు గాడిద పాలు తాగాలని అనుకునేవారికి ధర షాక్ ఇవ్వడం ఖాయం. ఈ పాల లీటర్ ధర కేవలం రూ. 7 వేలు. ప్రస్తుతం మార్కెట్ లో పాల లీటర్ ధర రూ 50 రూపాయలు. 140 లీటర్ల పాల ధరకు 1 లీటర్ గాడిద పాలు లభ్యం కానున్నాయి. శ్రేష్ఠమైన పాలైనా అంత ధర పెట్టి సామాన్య ప్రజలు ఈ పాలను కొనుగోలు చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న!











