ఒకే ఒక్క సినిమా ప్రపంచ వ్యాప్తంగా అతడిని రాత్రికి రాత్రి సూపర్ స్టార్ ని చేసింది. అతను పోషించిన పాత్ర జనానికి పిచ్చెక్కించింది. సైకో ఇలాగే ఉంటాడా? అసలు ఇలాంటి విలన్ ఉన్నాడా అనే రీతిలో ప్రజలు మాట్లాడుకున్నారు. ఆ పాత్ర పేరు జోకర్. ఆ నటుడి పేరు హీత్ లెడ్జెర్. సినిమా పేరు ‘ది డార్క్ నైట్’.కానీ ఆ సినిమా సక్సెస్ చూడటానికి హీత్ లెడ్జెర్ లేడు. డ్రగ్స్ ఓవర్ డోస్ అయి, సినిమా విడుదలకి ఆరు నెలల ముందే చనిపోయాడు. హీత్ లెడ్జెర్ ఆస్ట్రేలియా కి చెందినవాడు. ఆతని పదకొండో ఏటనే తల్లితండ్రులు విడిపోయారు. ఎవరికీ వారు వేరే పెళ్లిళ్లు చేసుకున్నారు. హీత్ జీవితం అగమ్య గోచరమైంది . ఆ దశలో హీత్ అక్క కేట్ తమ్ముడిని నటుడు గా మారమని ఎంకరేజ్ చేసింది. హీత్ లెడ్జెర్ కు కెమెరాలంటే పిచ్చి. కెమెరా చేతికి దొరికితే వదలడు. తనను తాను, పరిసరాలను, ఫ్రెండ్స్ ను కెమెరాలో వీడియో రూపంలో బంధించేస్తుంటాడు. నటుడిగా తనను తాను మెరుగుపరచుకోడానికి ఇది బాగా
ఉపయోగపడుతుందని అనుకునేవాడు.
టీనేజ్ లోనే టీవీ సీరియల్స్ లో నటించాడు. వరల్డ్ వైడ్ మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ అంటే హీత్ లెడ్జెర్ కి పిచ్చి. అందుకే చాలా మ్యూజిక్ వీడియోలకు ఎడిటర్ గా పని చేశాడు.1979లో పుట్టిన హీత్ లెడ్జెర్ హాలీవుడ్ నటుడు కావాలనే కోరిక తో తన19వ ఏట, 1998లో అమెరికా చేరుకున్నాడు. నటుడిగా మంచి అవకాశాలు వచ్చాయి. ‘10 థింగ్స్ ఐ హేట్ అబౌట్ యు’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అలాగే పేట్రియాట్ సినిమాలో మెల్ గిబ్సన్ పెద్ద కొడుకుగా నటించాడు. అది మంచి పేరు వచ్చింది. ‘బ్రొకెబాక్ మౌంటెన్’ సినిమాలో గే కౌబాయ్ గా నటించాడు హీత్ లెడ్జెర్. ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో మిచెల్లీ విల్లియమ్స్ పరిచయమైంది.. అదిప్రేమగా మారింది. ఇద్దరూ సహా జీవనం ప్రారంభించారు. వారికి 2005లో మెటిల్డా రోజ్ అనే పాప పుట్టింది. పెళ్లి చేసుకోకుండానే 2007లో విడిపోయారు. కారణాలు హీత్ చనిపోయిన తర్వాత కానీ బయట ప్రపంచానికి తెలియ లేదు. క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన, The Dark knight సినిమాలో విలన్ జోకర్ పాత్ర రావడం హీత్ లెడ్జెర్ కెరీర్ లో మంచి మలుపు , అనుకోని ముగింపు . జోకర్ పాత్ర గురించి హీత్ లెడ్జెర్ మాటల్లో చెప్పాలంటే ‘సైకోపతిక్ , మాస్ మర్డర్ లు చేసే వాడు , ఒక మానసిక రోగి ” షూటింగ్ పూర్తి అయినా , పాత్ర ప్రభావంలో నుంచి బయటికి వచ్చేవాడు కాదు. జోకర్ లాగానే విచిత్రంగా బయట బిహేవ్ చేసేవాడు .
సినిమా షూటింగ్ అధిక భాగం, రాత్రుళ్ళు గడ్డ కట్టే మంచు లో జరుగుతుండేది. యూనిట్ అంతా గజ గజా వణికి పోతుండేవాళ్లు. హీత్ లెడ్జెర్ అదేమీ పట్టించుకోనట్లు ఒక మత్తులో ఉండేవాడు. అప్పటికే అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. రాత్రి నిద్ర పట్టకపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది. డ్రగ్స్ తీసుకుంటే ఒక గంట మాత్రమే పడుకోగలిగే వాడు. ఎంత డ్రగ్స్ తీసుకున్నా.. రోజులో రెండు గంటలు మించి నిద్ర పట్టేది కాదు.
అప్పుడే హీత్ లెడ్జెర్ గురించి భయంకరమైన నిజాలు బయటికి వచ్చాయి. చాలా పసి వయసులో బహుశా తల్లితండ్రులు విడిపోయిన టైమ్ నుంచి హీత్ స్మోక్ జాయింట్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు. రోజుకి కనీసం అయిదు సార్లు అయినా జాయింట్స్ తీసుకునే వాడు హీత్.
హాలీవుడ్ కి వచ్చాక డ్రగ్స్ వాడకం ఇంకా ఎక్కువ అయింది. అతని ప్రియురాలు మిచెల్లీ విడిపోవడానికి హీత్ రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకోవడం కారణం అని తెలిసింది. చివరకి ‘ది డార్క్ నైట్’ ఎడిటింగ్ దశలో ఉండగా, 2008 జనవరి22 న మధ్యాహ్నం మూడు గంటలకు డ్రగ్స్ ఓవర్ డోస్ అయి చనిపోయాడు హీత్ లెడ్జెర్. ఎంతో ఫ్యూచర్ , స్టార్డామ్ ఉండి కూడా -28 ఏళ్ళ చిన్న వయసులోనే మరణించాడు హీత్ లెడ్జెర్ . వ్యక్తిగత జీవితం లో ఏర్పడే సమస్యలు ఏ మత్తు మందూ తీర్చలేదు. ఉన్న భవిష్యత్ కూడా నాశనం చేస్తుందని హీత్ లెడ్జెర్ తెలుసుకోలేక పోయాడు. అతను చనిపోయాక అతని ఆస్తుల గురించి అతని కుటుంబ సభ్యుల మధ్య చాలా గొడవలు జరిగాయి.