తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావు కుటుంబ ఆస్తి వివరాలు ధరణీ పోర్టల్లో నమోదయ్యాయి.
మర్కుక్ మండలంలోని ఎర్రవల్లిలో ఉన్న తన నివాసానికి ఆస్తుల నమోదు కోసం వచ్చిన గ్రామ కార్యదర్శి సిద్ధేశ్వర్‌కు సిఎం కేసిఆర్ తన ఆస్తుల వివరాలను తెలియజేశారు. తెలంగాణ వ్యవసాయేతర ఆస్తుల నమోదు పోర్టల్లో నివాస గృహాల వివరాలను గ్రామ కార్యదర్శి పొందుపర్చారు. ఓ సాధారణ పౌరుడిలి తన ఆస్తుల వివరాలను సిఎం తెలియజేశారు.
ప్రజలు నమోదు చేసుకోవాలి..
అనంతరం సిఎం చంద్రశేఖర్ రావు మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ మైలురాయిగా చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందని చెప్పారు. తమ స్థిరాస్తుల వివరాలను గ్రామీణ, పుర ప్రజలు నమోదు చేసుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. తమ ఆస్తులపై సంపూర్ణ హక్కు, భద్రత కల్పించేందుకే ఆస్తుల వివరాలను ధరణీ పోర్టల్‌లో నమోదు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విధిగా ప్రతి కుటుంబం తమ ఆస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇంతవరకు ఎవరూ చేపట్టని ఆస్తుల నమోదు ప్రక్రియ దేశంలోనే మొట్టమొదటి ప్రయత్నమని సిఎం చెప్పారు. వ్యవసాయ భూముల తరహాలోనే వ్యవసాయేతర భూములకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తామని ఆయన తెలిపారు.
దసరా సెంటిమెంటుతో..
దసరా సెంటిమెంటుతో తెలంగాణ ప్రభుత్వం వచ్చే దసరా పండుగ రోజున పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ముఖ్యమైన కార్యక్రమాలను దసరా రోజే ప్రభుత్వం తీసుకుంది. 2016 అక్టోబర్ 11వ తేదీ దసరా రోజు 21 నూతన జిల్లాలు తెలంగాణలో అమలులోకి వచ్చాయి. అలాగే 2018లో నారాయణపేట, ములుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది. ఈ దసరా పండుగ రోజున ధరణీ పోర్టల్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు. అందుకు అవసరమైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ తదితర అన్ని ఏర్పాట్లు పూర్తిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అలాగే కొత్తసచివాలయ పనులను దసరా రోజు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. అంతేకాకుండా 2021లో దసరా రోజున నూతన భనం నుంచే రాష్ట్ర పరిపాలన కొనసాగించాలనే కృతనిశ్చయంతో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది