గీతం యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణాల కూల్చివేత వ్యవహారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న దూకుడు పోకడలకు ఇది హైకోర్టునుంచి మరో ఎదురుదెబ్బ. తాము చేయబోతున్న పనికి ఎటొచ్చీ హైకోర్టు నుంచి స్టే వస్తుందని, బ్రేకు పడుతుందని ముందే అనుమానించినట్లుగా.. జీవీఎంసీ వారు అర్ధరాత్రి కూల్చివేతలకు తెగించారు. నవంబరు 30 తేదీకి ఈ కేసు వాయిదా పడింది. ఆలోగా.. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అప్పటిదాకా.. కూల్చివేతల విషయంలో అడుగు ముందుకు పడడానికి కూడా వీల్లేదని ఆదేశించింది.
ఇప్పటికే సగం పూర్తి చేశారు..
గీతం యూనివర్సిటీకి సంబంధించి ఆక్రమించారని అంటున్న భాగాల్లో నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. అర్ధరాత్రి 2 గంటలకే భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభించిన అధికార్లు దాదాపుగా తాము తలచినంత పని పూర్తిచేసేశారు. యూనివర్సిటీ ప్రధాన భవనాల్లో కొన్నింటికి మార్కింగ్ కూడా వేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నందుకే కూల్చివేశామంటూ అధికారులు అంటున్నారు. ప్రహరీ గోడ చాలావరకు కూల్చేశారు. ప్రధాన ద్వారం, సెక్యూరిటీ గదులన్నీ కూల్చేశారు.
ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేతలు చేపట్టారని గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇదే విషయంపై కోర్టును ఆశ్రయించింది. అయితే అధికారులు మాత్రం కొన్ని నెలల కిందటే నోటీసులు ఇచ్చామంటున్నారు.
రాజకీయ దుమారం
గీతం యూనివర్సిటీ కూల్చివేతలు వైసీపీ, తెలుగుదేశం మధ్య రాజకీయ దుమారానికి దారితీశాయి. ఇరు పార్టీలు వాడీవేడిగా విమర్శలు చేసుకుంటున్నారు. విద్యాలయాల కూల్చివేత దారుణమంటూ.. ఒకవైపు తెలుగుదేశం నాయకులు అంటుండగా.. అదే సమయంలో, ఆక్రమణలను వెనకేసుకు రావడాన్ని వైసీపీ నాయకులు తప్పుపడుతున్నారు.
మొత్తానికి నవంబరు 30 దాకా ఈ వ్యవహారంలో స్తబ్దత నెలకొన్నట్టే. ఆలోగా.. ఎవరి చర్యలు సబబు అని వారు ఆధారాలు తయారుచేసుకుంటారో చూడాలి.











