(విజయవాడ నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
బెజవాడ కనకదుర్గగుడి దేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. నేడు కరోనా కారణంగా దుర్గమ్మ దర్శనాన్ని పేదలకు దక్కకుండా చేసింది పాలకవర్గం. దుర్గగుడిలో ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భక్తుల సంఖ్యను తగ్గించి అమ్మవారి దర్శనానికి అనుమతించాలని పాలకమండలి నిర్ణయించింది.
అయితే పేద భక్తుల దర్శనం మాత్రమే తగ్గించే చర్యలు తీసుకున్నారు. ఆన్ లైన్లో 100, 200, 300, 500 టిక్కెట్లు కొనుగోలు చేసుకున్నవారు, ఆయా తేదీల్లో దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేశారు. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే మాలవేసుకుని ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చే భక్తుల దర్శనం నిలిపివేశారు. ఉచిత దర్శనం లేకపోవడమే ఇందుకు కారణం. ఉచితంగా దర్శించుకోవాలనుకునే భక్తులు కూడా ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలనే నిబంధన విధించారు. దీంతో పేద భక్తులకు అమ్మవారి దర్శనం లేకుండా పోయింది.
ఆదాయం తగ్గకుండా జాగ్రత్తలు
కరోనా కారణంగా దేవాలయాలకు వచ్చే భక్తులను నియంత్రించే ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల సమయంలో ప్రతి రోజూ లక్షమంది భక్తులు దర్శించుకుంటారు. కానీ కరోనా వ్యాపించకుండా రోజుకు పది వేల మందికి మాత్రమే దర్శనం ఏర్పాట్లు చేశారు. అది కూడా ఆన్ లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనం లభిస్తోంది.
అప్పటికప్పుడు దర్శనం కావాలంటే దక్కే అవకాశం లేదు. అంటే దేవాలయానికి ఆదాయం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పేదలు అమ్మవారిని దర్శించుకునే ఏర్పాట్లపై మాత్రం శ్రద్ధ పెట్టలేదు. అంటే ధనిక భక్తులు వస్తే ఆదాయం వస్తుంది. అంతే చాలనుకుంటోంది పాలకవర్గం. అందుకే ఉచిత దర్శనం లేకుండా చేశారనే విమర్శలు వస్తున్నాయి.
దందా మొదలైంది..
బెజవాడ దుర్గగుడిలో సిబ్బంది సహకారంతో కొందరు దందా కొనసాగిస్తున్నారు. ఆన్ లైన్లో టికెట్ కొనుగోలు చేసుకున్నవారు అదనంగా రూ.500 ఇస్తే లిప్ట్ ద్వారా తీసుకువెళ్లి దర్శనం చేయిస్తున్నారని తెలుస్తోంది. సిబ్బంది చేతులు తడిపితే వాహనాలను కూడా కొండపైకి అనుమతిస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, గర్భిణీల కోసం ఏర్పాటు చేసిన లిఫ్ట్ లను సిబ్బంది జేబులు నింపుకునేందుకు వాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ పాలకవర్గానికి తెలియకుండా జరుగుతున్నాయనుకోవడం భ్రమే అవుతుంది.
శానిటేషన్, ఏర్పాట్లకు రూ.4కోట్ల ఖర్చు
ఏటా దసరా ఉత్సవాల సమయంలో రోజుకు లక్ష మంది దర్శించుకుంటూ ఉంటారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పాలకమండలి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఏటా దసరా ఉత్సవాల ఏర్పాట్లకు రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. గతంలో దసరా ఉత్సవాల సమయంలో రోజుకు లక్ష మంది దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేసేవారు. శానిటేషన్ కు భారీగా కూలీలను పెట్టాల్సి వచ్చేంది.
ఈ ఏడాది రోజుకు పది వేల మందికే అనుమతిస్తున్నారు. కానీ లక్ష మంది దర్శనానికి అయ్యే ఏర్పాట్ల ఖర్చు ఏ మాత్రం తగ్గించలేదు. ఈ ఏడాది కూడా ఏర్పాట్లకు రూ.4 కోట్లు ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.











