ఏపీ మద్యం పాలసీ అక్రమార్కులకు వరంగా మారింది. ఏపీలో మద్యం ధరలు దేశంలోని అన్నీ రాష్ట్రాలకన్నా 200 శాతం దాకా అధికంగా ఉన్నాయి. ఈ ధరలు అక్రమార్కులకు వరంగా మారింది. అక్రమ సరకు రవాణాకు సరుకు ఎగుమతి లారీలు ఉపకరణాలుగా మారాయి. ఏపీ నుంచి పలు రాష్ట్రాలకు లారీల ద్వారా పెద్ద ఎత్తున సరకు ఎగుమతి అవుతోంది. ఆ లారీలు తిరిగి ఏపీకి వచ్చేప్పుడు అక్రమార్కులు ఆయా రాష్ట్రాల్లో బ్రాండెడ్ మద్యం కొనుగోలు చేసి వాటితో సహా అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయని తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి వాహనాలు రావడానికి అనేక చెక్ పోస్టులను దాటుకుని రావాల్సి ఉంటుంది. అయితే అవినీతికి అలవాటు పడ్డ చెక్ పోస్టుల సిబ్బంది, అక్రమ సరకు రవాణా వాహనాల నుంచి లంచాలు వసూలు చేసి వదిలేస్తున్నారని సమాచారం. దీన్ని ఆసరాగా చేసుకుని పొరుగు రాష్ట్రాలకు వాహనాలు నడిపే యజమానులు, డ్రైవర్లు అక్రమంగా మద్యాన్ని ఏపీలోకి డంప్ చేస్తున్నారని విజయవాడ ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.
అడ్డుకట్ట పడేనా?
ఏపీ నుంచి ముఖ్యంగా అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు ప్రతి రోజూ 200 లారీల్లో చేపలు, రొయ్యలు, కోడిగుడ్లు ఎగుమతి అవుతున్నాయి. అలా ఆయా రాష్ట్రాల్లో సరుకు దింపి వచ్చేప్పుడు అక్కడ దొరికే బ్రాండెడ్ మద్యం కొనుగోలు చేసి లారీల్లో తెస్తున్నారని అబ్కారీ శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవల విజయవాడ సమీపంలోని పెనమలూరుకు దిగుమతి అయిన రూ.25 లక్షల విలువైన మద్యాన్ని అబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు.
ఏపీకి అక్రమంగా దిగుమతి అయ్యే మద్యంలో పోలీసులు, అబ్కారీ శాఖ అధికారులు పట్టుకునే సరకు 5 శాతం కూడా ఉండదు. ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా అక్రమ మద్యం డంప్ అవుతోంది. దీని ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.600 కోట్ల ఆదాయం కోల్పోతోందని ఒక అంచనా. పోలీసులు, ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్రమార్కులు మాత్రం ఏదో ఒక రకంగా అక్రమంగా మద్యం తరలిస్తూనే ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయడం కష్టసాధ్యంగా మారింది.
గుంటూరు జిల్లాలో దారుణంగా తగ్గిన ఎక్సైజ్ ఆదాయం
ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో మద్యం ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో లక్ష్యాలు చేరుకోలేని అబ్కారీ అధికారులు ఉన్నత అధికారుల నుంచి చీవాట్లు తినాల్సి వచ్చిందట. అసలు గుంటూరు జిల్లాలో మద్యం అమ్మకాలు, ఆదాయం పడిపోవడానికి గల కారణాలను అన్వేషించేందుకు రెండు బృందాలను పంపారు. గుంటూరు జిల్లాలోని మాచర్ల, గురజాల, పెదకూరపాడు నియోజకవర్గాలకు తెలంగాణతో సరిహద్దులు ఉన్నాయి. దాదాపు 80 కిలోమీటర్ల కృష్ణా నది తెలంగాణతో సరిహద్దుగా ఉంది.
ఈ ప్రాంతంలో పోలీసులు, అబ్కారీ శాఖ సిబ్బంది ఎంత నిఘా పెట్టినా అర్థరాత్రి నదిలో ఏదో ఒక ప్రాంతంలో అక్రమార్కులు మద్యం చేరవేస్తున్నారని గుర్తించారు. దీనికి కొందరు అధికార పార్టీ నేతల అండకూడా తోడు కావడంతో ఇక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తాజాగా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తిలో భూమిలో దాచిన లక్షలాది రూపాయల విలువైన మద్యం వెలికి తీయడానికి పోలీసులు పొక్లెయినర్ ఉపయోగించాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం తరలించి అనేక ప్రాంతాల్లో దాస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇలాంటి అక్రమార్కులకు అధికారపార్టీ నేతల అండ పుష్కలంగా ఉండటంతో పోలీసులు పెద్దగా తనిఖీలు నిర్వహించడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.
మద్యం ధరలు తగ్గించడమే పరిష్కారం
ఏపీలో మద్యం ధరలు పొరుగు రాష్ట్రాలకు సమానంగా తగ్గించడంతోపాటు, అన్ని రకాల బ్రాండ్లు అందుబాటులో ఉంచితే అసలు అక్రమ మద్యం అనేదే లేకుండా పోతుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే మద్యనిషేధంలో భాగంఅంటూ మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, ధరలు తగ్గించే ఆలోచన చేయడం లేదు. అక్రమ మద్యంతో పాటు, ఏపీలో నాటు సారా ఏరులై పారుతోంది. అధిక ధరలు పెట్టి పిచ్చిమందు కొనుగోలు చేసేకన్నా, నాటు సారా బెటరని అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజనులు నాటుసారా తయారీకి అలవాటు పడ్డారట.
ఇటీవల ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం, అరకు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నాటుసారా తయారీ కేంద్రాలను అబ్కారీ శాఖ అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఏపీలో మద్యం ధరలు తగ్గించి, అన్నీ బాండ్లు అందుబాటులో ఉంచక తప్పదని పలువురు అభిప్రాయపడుతున్నారు.