గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాలు ఆఖరి రోజున ప్రతి ఏడాది దుర్గమ్మకు నిర్వహించే తెప్పోత్సవం పై ఈసారి సందిగ్ధత నెలకొంది. కృష్ణానదిలో ప్రమాద స్థాయిలో నీరు ప్రవాహిస్తుండడంతో ఈ సారి తెప్పోత్సవం జరుగుతుందా? లేదా? అనే సందేహలు కలుగుతున్నాయి.
దుర్గమ్మకు తప్పని తిప్పలు..!
దసరా నవరాత్రులు మొదలు అయ్యాయి అంటేనే విజయవాడ కనక దుర్గమ్మ వారి గుడికి రెండు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో వస్తారు. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా ఇప్పటికే భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు. ఈ విషయం ఎంతో మంది భక్తులను నిరాశ పరిచిన విషయం తెలిసిందే.
నవరాత్రులను దుర్గ గుడి అధికారులు వైభవంగా నిర్వహిస్తున్నప్పటికీ వారికి ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా ఉచిత దర్శనాన్ని రద్దు చేశారు అధికారులు. దీని పట్ల భక్తుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వర్షాలు అధికంగా పడ్డాయి.
నవరాత్రుల్లో ఐదవ రోజున కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ నవరాత్రులు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి. నవరాత్రులు ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆఖరి రోజైనా దసరా (అక్టోబర్ 25) రోజు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా తెప్పోత్సవం నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజి వద్ద 3 లక్షల 77 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతుంది.
దీంతో ఆలయ అధికారులు తెప్పోత్సవం నిర్వహించడం పై సందిగ్ధంలో పడ్డారు. వరద ఉద్ధృతి తగ్గితేనే తెప్పోత్సవానికి అనుమతి ఇస్తామంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే ఆలయాధికారులకు తెలిపారు.
తిరుమలేశుని పరిస్థితి కూడా అంతే
తిరుమల శ్రీవారికి కూడా బ్రహ్మోత్సవాలు పరిమితంగానే జరుగుతున్నాయి. ఈ ఏడాది అధికమాసం కారణంగా స్వామివారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించే అవకాశం వచ్చింది. అయితే ఈ రెండు సార్లు కూడా ఉత్సవాలను ఏకాంతంగా ఆలయ ప్రాంగణం లోపల మాత్రమే నిర్వహిస్తున్నారు. అలాగే వాహన సేవల్లో కూడా కొన్ని జరగడం లేదు. తిరుమలేశునికి స్వర్ణరథోత్సవం నిర్వహించడం. ఆలయ ప్రాంగణంలో సాధ్యం కాదు కనుక, దానికి బదులుగా సర్వభూపాల వాహన సేవ నిర్వహించారు. అలాగే రథోత్సవం కూడా రద్దే. అదే తరహాలో కొవిడ్ దెబ్బకు, బెజవాడ కనకదుర్గమ్మకు ఉత్సవాలన్నీ పరిమితమైన భక్తులతో జరుగుతున్నాయి. వరదదెబ్బకు తెప్పోత్సవం కూడా లేకుండా పోతోంది.










