మరణంలేని మనుషులుంటారా? మనిషి ఆయువు పెంచుకునే మార్గాలేమిటి? ఆంజనేయుడు, అశ్వత్థామ, మహావతార్ బాబాజీ ఇంకా శరీరాలతో ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. మన పురాణాల దగ్గర మొదలుపెట్టి నేటి సైన్స్ దాకా మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మరణం కూడా అలాంటిదే. ఎవరికీ దీని మీద అవగాహన లేదు. పైగా అన్నేళ్లు బతికి సాధించేది ఏమిటి? 70 ఏళ్లు బతకడానికే ఎన్నో బాధల్ని అనుభవిస్తున్నాం. ఇంత తక్కువ ఆయువు ఉంటేనే మనిషి ఎన్నో వక్రమార్గాలు పడుతున్నాడు.
అన్నేళ్లు బతకగలిగితే ఇంకా ఎన్నో తప్పులు చేస్తాడు అనేవాళ్లు చాలామందే ఉన్నారు. అసలు మనిషి భగవంతుడు ప్రసాదించిన ఆయుషు ఎంత? ఎంతవరకు మన ఆయుషు పెంచుకోవచ్చు అనే అంశాలను చూద్దాం. ఆంజేయుడికి అంత ఆయుషు ఎందుకొచ్చిందనేది అసక్తికర అంశం. బ్రహ్మ ఆంజనేయుడికి చిరంజీవత్వాన్ని ప్రసాదించాడంటారు. అందుకే ఆంజనేయుడు మరణం లేకుండా హిమాలయాల్లో ఉన్నాడట. హిమాలయాల్లో హనుమంతుడు కనిపించాడని, 20 అడుగుల ఎత్తు ఉన్నాడని ఇండియన్ ఆర్మీ ట్వీట్ చేయడం సంచలనం కలిగించింది. ఓ పెద్ద జీవి అడుగుజాడలను కూడా వారు ఫొటోల్లో బంధించి షేర్ చేశారు. త్రేతాయుగం నాటి ఆంజనేయుడివే ఈ పాద ముద్రలా అనేది తేలాలి.
ఇక అశ్వత్థామ విషయానికి వస్తే ఆయన ద్వాపరయుగంలో వాడు. అశ్వత్థామకు సంబంధించి కూడా మన దగ్గర రకరకాల కథనాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి శాపం కారణంగా అశ్వత్థామ నైమిశారణ్యంలో తిరుగుతుంటాడని అంటారు. అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని ఉత్తరాదిలో నమ్ముతారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్‌కు ఆయన కనిపించాడనే ప్రచారం సాగుతోంది. హిమాలయాల్లో గిరిజనులతో కలిసి జీవిస్తున్నాడనేది మరో కథనం. ఏడాదిలో ఒక రోజు ఓ హోటల్‌కు వచ్చి భోజనం చేసి వంద లీటర్ల నీరు తాగి మాయమవుతుంటాడని మరికొందరంటారు. నిజానిజాలు తేలాలి.
బాబాజీ సంగతేమిటి?
రజనీకాంత్ బాబా తర్వాత మహావతార్ బాబాజీ గురించి అందరికీ తెలిసింది. ఆయనకు 2500 సంవత్సరాల వయసుంటుందని రజినీ ఆ సినిమా విడుదల సందర్భంలో ప్రకటించారు. రజినీ తరచూ హిమాలయాల్లో ఉన్న బాబాజీ గుహలోపలికి వెళ్లి ధ్యానం చేస్తుంటారు. బాబాజీ అసలు పేరు నాగరాజు. తమిళనాడులోని ఫరంగిపేట గ్రామంలో ఓ నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఏసుక్రీస్తు, బాబాజీ సమకాలికులు అనే వాదన కూడా ఉంది. వీరిద్దరూ కలిశారని కూడా చెబుతుంటారు. క్రీస్తుపూర్వం 203 నవంబర్ 30న ఆయన పుట్టినట్లుగా చరిత్రలో ఉంది. ఇప్పుడు 2020 సంవత్సరం నడుస్తోంది కాబట్టి ఆయన వయసు దాదాపు 2230 సంవత్సారాలు పైనే అయి ఉండాలి. ఇప్పటికీ ఆయన హిమాలయాలలో తిరుగుతుంటారని, ప్రయాగలో జరిగే కుంభమేళాకు వస్తుంటారని అంటుంటారు.
కాలంతో ప్రయాణించాల్సిందేనా
భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఓ మాటంటాడు. కాలం తనేనంటాడు. కాలం అంటే టైమ్ కదా.. ఈ కాలం నుంచి పుట్టిందే టైమ్ మెషీన్ కూడా కావచ్చు. ఇది సైన్స్ కు సంబంధించిన అంశం. దీన్నిబట్టి మనకు అర్థమవుతున్నదేమిటంటే మనిషి ఆయుషుకు టైమ్ తో సంబంధం ఉండిఉండాలి. అతనికి టైమ్ వచ్చింది పోయాడు అనే మాటను కూడా మనం వింటుంటాం. టైమ్ మెషీన్ సినిమాలు మనం చూశాం కాబట్టి దీని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. యోగులంతా కాంతి రూపంలో ఉంటారని అంటుంటారు. ఇక్కడ కాంతి అనేది కూడా కీలకం అనేది అర్థమవుతోంది. ఐన్ స్టీన్ థియరీ ప్రకారం కూడా కాంతి వేగంతో నడిచే వాహనంలో మనిషి ప్రయాణించగలిగినపుడు అందులో ఉండేవారికి అయుషు మారదట. ఇదంతా భౌతిక శరీరానికి సంబంధించిన విషయం.
ప్రతి జీవిలోనూ ఆత్మ ఉండటం, దాన్ని యోగం ద్వారా భగవంతుడితో అనుసంధానించడం జరిగినపుడు కూడా వయసు మారకుండా చేసే విధానమే క్రియాయోగం అంటారు. ఇదంతా పతంజలి యోగ సూత్రాలలోనూ ఉంటుంది. ఇక్కడ కీలక పాత్ర వహించేది మనిషి శ్వాస. మనిషి నిమిషానికి 15 లేదా 16 శ్వాసలు తీస్తుంటాడు. ఈ శ్వాసల నియంత్రణ ద్వారా ఆయుషు పెంచుకోవడమే యోగశాస్త్రంలో ఉండే విధానం. తక్కువ శ్వాసలు తీసే జీవి ఎక్కువ కాలం బతుకుతుందని తేల్చారు. మనిషి నిమిషానికి 15 శ్వాసలు తీసేదాని ప్రకారం లెక్కించి అతని పూర్ణాయుష్షు 120 సంవత్సరాలుగా నిర్ణయించారు.
తాబేలు నిమిషానికి మూడు శ్వాసలే తీస్తుందట. అందుకని తాబేలు 500 ఏళ్లు బతుకుతుందని తేల్చారు. అన్ని జీవుల వయసునూ ఇలాగే లెక్కిస్తున్నారు. ఈ లెక్కకు కూడా శాస్త్రీయత కనిపిస్తోంది. హిమాలయాల్లో వేలాది సంవత్సరాలు జీవించే యోగులంతా ఇలాంటి సాధన ద్వారానే ఆ స్థితికి చేరారని అంటారు. శ్వాసలు తగ్గడం వల్ల మన ఆయుషు ఎందుకు పెరుగుతుందో కూడా చూద్దాం. కోట్ల కణాల కలయికే ఈ శరీరం. మానవ శరీరంలోని ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా అనే కణ వ్యవస్థ ఉంటుంది. ఇది మనం శ్వాస తీసుకున్నపుడు గాలిలోని ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. దీని వల్ల ఉష్ణం పుడుతుంది. ఆ ఉష్ణమే మనకు కావలసిన ప్రాణ శక్తిని అందిస్తుంది.
ఇలా ప్రతి కణం నుంచి కూడా ఉష్ణం పుడుతుంది. మనం 15 సార్లు శ్వాస తసుకుంటే 15 సార్లు ఉష్ణం పుట్టినట్లుగానే భావించాలి. ఆ కణం మూడు రోజుల పాటు ఏకధాటిగా పనిచేసిన తర్వాత తన సామర్ధ్యాన్ని కోల్పోయి మరణిస్తుంది. ఈ మృతకణాలన్నీ మలినం రూపంలో మన శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. వాటి స్థానంలో కొత్త కణాలు మనం తీసుకునే ఆహారం ద్వారా తయారవుతాయి. బయటికి వెళ్లిపోయే కణాలు ఏ రూపంలో వెళతాయనే సందేహం మీకు కలగొచ్చు. చెమట, ఉమ్మి, మూత్రం, మలం లాంటి వాటి రూపంలో ఇవి బయటికి వెళ్లిపోతాయి. ఈ కణాల బయటికి పోకపోతే మాత్రం మనిషి అనారోగ్యం బారినపడతాడు.
మనిషి ఆయుషుకూ దీనికి ఏమిటి సంబంధం అని మీరనుకోవచ్చు. అక్కడికే వస్తున్నా. 15సార్లు ఉష్ణం ఉత్పత్తి చేసే కణం మూడు రోజులు బతికి ఉంటుంది. తక్కువ సార్లు ఉష్టం ఉత్పత్తి చేసే జీవి ఎక్కువ కాలం జీవిస్తుంది. అంటే కణం వయసు కూడా పెరుగుతున్నట్టే కదా. అంటే నిమిషానికి శ్వాసల సంఖ్య తగ్గించే కొద్దీ కణాలు పనిచేసే కాలం పెరుగుతోంది. ఆయుషు పెరగడంలో ఉన్న అసలు రహస్యం ఇదే. అసలు శ్వాసే లేని సమాధి స్థితిలో ఇక కణాలు సజీవంగా ఉన్నట్టే కదా. మన శ్వాస నిమిషానికి 15 నుంచి 14కు తగ్గితే మన వయసు 20 సంవత్సరాలు పెరుగుతుందట. కణం వయసును మూడు నుంచి 21 రోజుల వరకూ పెంచగలిగితే మనం 2100 సంవత్సరాలు కూడా బతకొచ్చన్నమాట.
నిమిషానికి 15కు మించి శ్వాసలు పెరిగితే కణాల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. యోగులు వేలాది సంవత్సరాలు బతికి ఉండటానికి కారణం ఈ శ్వాసలు లేని సమాధి స్థితిలో ఉండగలడమేనట. దీనికే క్రియాయోగం అని పేరుపెట్టారు. మహావతార్ బాబాజీగాని మరెవరైనాగాని ఇంకా ఉన్నారంటే కారణం ఈ శ్వాసల నియంత్రణను వారు సాధించడమే. ఇది జీవుల అంతర్గత ప్రయాణంతో సాధ్యమవుతుంది. ఇక బహిర్గత ప్రయాణంతో దీన్ని సాధించాలంటే టైమ్ మిషన్ లాంటి సాధనాలు కావలసిందే. లేదా కాంతి వేగంతో ప్రయాణించగలగాల్సిందే.
అది ఎప్పటికి సాధ్యమవుతుందన్న మనం చెప్పలేం. ఒకవేళ గ్రహాంతర జీవులు దీన్ని సాధించి కాలంతో ప్రయాణిస్తున్నారేమో మనం చెప్పలేం. ఈ ప్రకారం చూస్తే వేలాది సంవత్సరాల వయసుతో హిమాలయాలలో తిరుగాడుతున్న యోగులు లేరని మాత్రం చెప్పలేం. నేను అనేది ఈ శరీరం కాదని ఎవరైతే తెలుసుకుంటారో వారు ప్రకృతితో మమేకమై ఉంటారు. నేను అనే ఉనికిని కోల్పోయినప్పుడు ప్రకృతిలో లయమై జీవిస్తూనే ఉంటారు. మరణంలేని మనుషుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే పై వీడియో చూడండి.
-హేమసుందర్ పామర్తి