తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాయి. ఈనేపథ్యంలోనే గులాబీ బాస్ కెసిఆర్..తెరాసకు చెందిన ఆరు జిల్లాల మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సిలు, ఎంపీలతో శనివారం ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికలపై వ్యూహరచన చేసి వారికి దిశానిర్ధేశం చేసిన విషయం తెలిసిందే. పట్టభద్రులు, నిరుద్యోగులు తెరాసకు వ్యతిరేకమనే అంశం ఆ సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే టిఆర్ఎస్ నిజంగానే ఈ విషయంలో భయపడుతుందా. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ తెరాసకు వ్యతిరేకంగా ఓటింగ్ వేయబోతున్నట్లు అధికార పార్టీకి ముందే ఉప్పు అందినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏ ఎన్నికలకైనా గులాబీ పార్టీ ఓటర్ల నాడిని తెలుసుకునేందుకుగానూ ముందస్తుగా సర్వే చేయిస్తుంది. ఆ సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా వ్యూహాల్లో మార్పులు చేర్పులు చేసుకొని ఎన్నికలకు పోయే ఆనవాయితీ తెరాసకు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా తెరాస ముందస్తు సర్వే ఏమైనా చేయించి ఉండొచ్చు కాబట్టే వారికి ప్రతికూల వాతావరణం ఉన్నదని ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే యువతను ఆకట్టుకునేందుకు సిఎం తమ నేతలను దిశానిర్ధేశం చేశారని ప్రచారం జరుగుతోంది. పట్టభద్రులు తెరాసకు వ్యతిరేకమనే ప్రచారాన్ని తిప్పికొట్టేలా ఎన్నికలపై దృష్టి సారించాలని సిఎం వారికి సూచించినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వంపై గుర్రుగా పట్టభద్రులు..
సిఎం దృష్టికొచ్చిన పట్టభద్రులు తెరాసకు వ్యతిరేకమా? అనే అంశంపై ప్రస్తుతం సర్వత్రా చర్చజరుగుతోంది. గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగులు తెరాస వైఖరీ పట్ల వ్యతిరేకంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని, ఇంటికొక ఉద్యోగం వస్తుందనే ప్రకటనలు చేసి, రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగాల ఊసే తెరాస ప్రభుత్వం మరిచిపోయిందనే ఆరోపణలను గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారు. ఆ నాడు చెప్పిన స్థాయిలో ప్రస్తుతం ఉద్యోగ నోటికేషన్లను ప్రభుత్వం వేయటం లేదని పట్టభద్రులు, నిరుద్యోగులు భావిస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు ఉద్యోగాల కోసం ఎదురుచూడడం తమ వల్ల కాదనే భావనతో వారున్నారు. వరుసగా నోటిఫికేషన్లు వేయకుండా కంటితుడుపు చర్యగా అమాసపున్నానికి వేస్తూ ఇదిగో, అదిగోనంటూ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం తాత్సారం చెస్తుందని యువత అభిప్రాయపడుతున్నది. ఈక్రమంలోనే తమ ఓటుతో రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని గ్రాడ్యుయేట్స్ యువత భావిస్తోంది.
ఉద్యోగాలెక్కడా?..
2015 జులై నుంచి 2020 జులై వరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 29,092 పోస్టులను మాత్రమే భర్తీ చేసినట్లు సమాచారం. సుమారు మరో 7550 వరకు పోస్టులను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వెలువడిన ఉద్యోగ పోస్టుల భర్తీకి మొదటి 4ఏళ్లలో ఎక్కువగానే నోటిఫికేషన్లను జారీచేసినప్పటికినీ ఆ తరువాత మాత్రం ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు విడుదల చేయలేదని నిరుద్యోగులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే అంశం అధికార పార్టీకి టెన్షన్‌గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్సే ఓటర్లుకాబట్టి వారు తెరాసకు ఓటు వేస్తారా? లేదా అని చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. తెలంగాణ హవావీస్తున్న సమయంలోనే గతంలో ఈ రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి చేతిలో తెరాస ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. మరీ ఈ దఫా ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందోనని టిఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుంది. ఈనేపథ్యంలోనే పట్టభద్రుల ఓట్లను రాబట్టేందుకు సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. పట్టభద్రులు తెరాసకు వ్యతిరేకమనే ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రచార కార్యక్రమాలను చేపడుతోంది. మరోపక్క ఇదే అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెరాసకు పట్టభద్రులు అనుకూలమా? లేక వ్యతిరేకమా? అనేది త్వరలో జరిగే ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయి.











