మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ ఇకలేరు. ఆయన వయస్సు 59 సంవత్సరాలు. కొన్ని రోజుల కిందట ఆయన కరోనా బారిన పడ్డారు. ఇటీవలే ఆయనకు జరిపిన పరీక్షలలో కరోనా నెగటివ్ గా నిర్దారణ అయింది. కానీ ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో ఆయనను వైజాగ్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. పరిస్థితి విషమించి ఇవాళ ఆయన తుదిశ్వాస విడిచారు. హాస్పిటల్ కి వెళ్లిన రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవ౦తి శ్రీనివాస్ ద్రోణ౦రాజు కుమారుడిని, కుటుంభ సభ్యులను పరామర్శించారు.
విశాఖ వన్‌టౌన్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగినా ఆయన కాంగ్రెస్ తోనే నడిచారు. ఆ తరువాత వైసీపీలో చేరి 2019లో వైజాగ్ సౌత్ నుంచి మరోమారు పోటీ చేశారు. ఈ ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థి వాసుపల్లి గణేష్ చేతిలో ఓడిపోయారు. దీంతో వైసీపీ అధికారంలోకి రాగానే వీఎంఆర్డీ ఛైర్మన్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ తనయుడుగా ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ద్రోణంరాజు శ్రీనివాస్ కు భార్య శశి, కుమార్తె శ్వేత, కుమారుడు శ్రీవత్సవ ఉన్నారు. ఆయన మృతితో వైజాగ్, వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లనుంది. శ్రీనివాస్ మృతికి రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు. శ్రీనివాస్ మృతి బ్రాహ్మణ సమాజానికి తీరని లోటని కోట రవికూమార్ అన్నారు.











