పుట్టింది భారత్ లో, నేర్చుకుంది భారతీయ సంప్రదాయ కర్నాటిక్ సంగీతం. కానీ అభిరుచి మాత్రం వెస్ట్రన్ మ్యూజిక్ పైన. సంప్రదాయ సంగీతానికి, తన అభిరుచిని జత చేసి సంచలనాన్ని నమోదు చేసింది భారతీయ గాయని ప్రియ దర్శిని. ఇది తను విడుదల చేసిన మొదటి ఆల్బమ్, అయితేనేం యువతను ఎంతగా ఆకట్టుకుందంటే అమెరికాలోని 63 వ గ్రామీ అవార్డ్స్ లో ‘ఉత్తమ న్యూ ఏజ్ ఆల్బమ్’ విభాగాల్లో పోటీ పడేందుకు ఎంపిక అయ్యేంత. భారత్ లో సంగీతం, అమెరికాలో ఆల్బమ్ ఎలా ఇదంతా తెలియాలంటే… ప్రియ కథ తెలుసుకోవాల్సిందే.
మ్యూజిక్ మాంత్రికురాలు
ముంబై లోని ఒక తమిళ కుటుంబంలో ప్రియ దర్శిని జన్మించింది. స్వతహాగా భారతనాట్యం డ్యాన్సర్, సంప్రదాయ గాయకురాలు అయిన ప్రియ బామ్మ కూడా ప్రియ దర్శినియే. పేరు మాత్రమే కాదు, తన బామ్మ సంగీతాభిరుచిని కూడ పునికి పుచ్చుకుంది ప్రియ. ఈ బామ్మ తన మనవరాలికి సంగీతాన్ని చిన్నతనం నుంచే నేర్పింది. అవే తన జీవితాన్ని మలుపుతిప్పాయి. అగ్రరాజ్యంలో అతిరథ మహారథులతో పోటీ పడడానికి దారులు వేశాయి.
పాశ్చాత్య అభిరుచి
చిన్నతనం నుంచి నేర్చుకున్నది సంప్రదాయ కర్నాటిక్ సంగీతమైన, ప్రియకు పాశ్చాత్య సంగీతం పట్ల మక్కువ ఉండేది. ఆ ఇష్టమే తనని నేడు ఈ స్ధాయిలో నిలబెట్టింది. ఇది సాధించడానికి ముందు తను వందల సంఖ్యలో టెలివిజన్, రేడియో యాడ్స్ కి పనిచేసింది. అంతేకాదు ఎన్నో ప్రముఖ కంపెనీలతో కలిసి పనిచేసింది. ఎన్ని చేసినా, సంప్రదాయ కర్నాటిక్ సంగీతం, అమెరికా పాప్ సంగీతాన్ని కలిపి ఒక ఆల్బమ్ తయారుచేయాలనే తన ఆశ తీరలేదు. ఈ సంగీత ప్రయాణంలోనే అమెరికాలో అడుగుపెట్టిన ప్రియ తన కోరికకు అనుగునంగా ‘పెరిఫెరి’ అనే పేరుతో తన మొదటి ఆల్బమ్ ని విడుదల చేసింది.
మొదటి అడుగుతోనే గ్రామీ పోటీలో నిలిచింది
తన అభిరుచికి తగ్గట్టుగా తను చేసిన మొదటి ప్రయత్నం ఇంతటి సంచలనం సృష్టిస్తుందని ప్రియ కూడా ఊహించలేదు. కానీ, తన మొదటి ప్రయత్నమే ఇంతటి విజయం అందడం వల్ల తన తర్వాతి ప్రయత్నాలకు ప్రోత్సాహం లభించినట్లైందని తెలియజేసింది. ఈ ఆల్బమ్ లో భారతీయ వివిధ సంప్రదాయాలను ప్రదర్శించింది. కేవలం సంగీతమే కాదు, ‘జన రక్షిత’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతుంది ప్రియ. అంతేనా, హిమాలయాల్లో 100 మైళ్ల పరుగు పోటీలో గెలిచిన మొదటి మహిళగా పేరు పొందింది.
వావ్! తన మల్టీ ట్యాలెంట్ తో అందరి ప్రశంసలు అందుకుంటున్న ప్రియ దర్శనిని మనం కూడా అభినందిద్దాం రండి. ముంబైలో పుట్టి అమెరికాలో భారతీయ సంగీతానికి వన్నెలద్దుతున్న ప్రియ పోటీలో నిలవడం కాదు… అవార్డు కూడా గెలవాలని ఆశిద్దాం. తన కథ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.