గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో పోటీ పడేందుకు అభ్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. నిన్నటి నుంచి ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం కావడంతో…అభ్యర్థులు హడావుడి మొదలయ్యింది. ఎవరికి వారు తమ వారిని ఓటరుగా నమోదు చేయించేందుకు పరుగులు పెడుతున్నారు. ఎక్కడికక్కడ కార్యాలయాలను ప్రారంభించడంతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారి కోసం వెతకడం మొదలెట్టారు. పార్టీల వారీగానే కాకుండా స్వతంత్రంగా పోటీ చేసే వారూ తమ బలాలను సమకూర్చుకుంటున్నారు.
మరో దారా…సొంత దారా..?
ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ సైతం తన బలాన్ని అంచనా వేసుకునే పనిలో పడ్డారు. మొదట ప్రభుత్వోద్యోగిగా ఉన్న ఆయన ఎంపీగా ఉన్నసమయంలో కేసీర్ వద్ద పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్న దిలీప్ ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడంతో తన దారి తాను చూసుకున్నారు. ఈ క్రమంలో 2007 నుంచి 09 వరకు మొదటి సారి ఎమ్మెల్సీగా కొనసాగిన అతను 2009 నుంచి 2015 వరకు మరో టెర్మ్ పనిచేశారు. ఆ తరువాత కొన్ని రోజులు తెలంగాణ జనసమితితో కలిసి అడుగులేసిన దిలీప్ 2019 అసెంబ్లీ తర్వాత తన దారి తాను చూసుకుంటున్నారు. అందరితోనూ సఖ్యంగా ఉండే దిలీప్ ఈ ఎమ్మెల్సీ బరిలో ఉంటారా లేదా? అన్నది ఆసక్తి కరంగా మారుతోంది. 2015 తరువాత ప్రజా ప్రతినిధిగా గెలవకపోయినా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ప్రజాపోరాటల్లో పాల్గొంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ మల్కాజ్ గిరి నుంచి టీజేఎస్ తరఫున పోటీ చేశారు.
బలం ఉంటేనే బరిలో…
తాజాగా ఖాళీ కాబోతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరోమారు తాను ఎన్నికల బరిలో ఉండాలా? వద్దా? అన్న దానిపై దిలీప్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఎన్నికలకు సంబంధించి ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభించానని చెబుతున్న ఆయన మొదట తన బలాబలాలను బేరీజు వేసుకున్నాకే బరిలో ఉండేదీ లేనిదీ చెబుతానంటున్నారు. ఇప్పటికే తన సన్నిహితులతో ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారు. తనకు సంబంధించిన వారు 25వేల మందిని ఎన్ రోల్ చేసుకుంటేనే బరిలో ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కనీస బలం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఓటరునమోదు కార్యక్రమం ముగిశాక నవంబర్ 6న ఎవరి బలాలు…బలగాలు ఎంతన్నది తెలుస్తుందని, అనుకున్న నెంబర్ రీచ్ అయితేనే బరిలో నిలుస్తానని దిలీప్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఎవరికి మద్దతివ్వాలన్న విషయంగానూ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.










