రాష్ట్రంలో దుబ్బాక ఉపఎన్నికల హీట్ పెరిగింది. పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అందరికంటే ముందుగానే ఊహాగానాలకు తెరదించుతూ టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య పేరును ప్రకటించేసింది. బీజేపీ తమ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరును మంగళవారం ప్రకటించింది. సోనియా గాంధీ నుంచి క్లియరెన్స్ వస్తే.. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిని బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. రెండు పార్టీలు పాతవారికే టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం కొత్తగా పార్టీలో చేరిన చెరకు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న కసితో ఉన్న టీఆర్ఎస్ ప్రచారాన్ని ఉధృతం చేసింది. ముఖ్యనేతలంతా స్థానికంగా ఉంటూ ఓటర్లను టీఆర్ఎస్ ను గెలిపించమంటూ అభ్యర్థిస్తున్నారు.
సీరియస్ గా తీసుకున్న కేసీఆర్
ఇది కేవలం ఒక స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికే. అది కూడా సిటింగ్ స్థానమే. సానుభూతి కూడా ఎడ్వాంటేజీ అవుతుంది. అయినా సరే గులాబీ బాస్ మాత్రం దుబ్బాక ఉప ఎన్నికలపై సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్ నుండి ఎన్నికల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు హరీష్ రావ్ తో పాటు ఇతర నేతలతో టచ్ లో ఉంటూ అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాక సీట్ ను కోల్పోకూడదంటూ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ , బీజేపీలుకూడా తమతమ భబలగాలను మొత్తం దుబ్బాకలో మోహరించాయి. దీంతో వారందరి పన్నాగాలను పటా పంచలు చేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలంటూ సూచిస్తున్నారు.
గ్రామగ్రామానా టీఆర్ఎస్ చేసిన అభివృద్ది కార్యక్రమాలు ప్రచారం చేయడంతో పాటు భవిష్యత్ లో టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక అభివృద్దికి ఏం చేస్తుందో చెప్పాలంటూ సూచిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేస్తున్న అన్యాయం పై కూడా ప్రచారంలో ప్రస్తావించాలని .. ఓటు అడిగేందుకు వచ్చే బీజేపీ నేతలను నిలదీసేలా ప్రజలకు వాస్తవాలు వివరించాలని నేతలతో చెప్పినట్టు సమాచారం.ఇక రామలింగా రెడ్డి దుబ్బాకకు చేసిన అభివృద్ది , ఆయన నిబద్దతను ప్రజలకుగుర్తు చేస్తూ ఆయన కుటుంబాన్ని ఆదరించాలని ప్రజలను కోరాలంటూ సూచించినట్టు తెలుస్తోంది.
పక్కా వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తే ఓటర్లు మనను ఆదరిస్తారని.. కేవలం ప్రజలకు తామున్నామన్న భరోసా ఇస్తే చాలు వారు మన వెంటే ఉంటారంటూ నేతలకు ఉత్సాహం నూరిపోస్తున్నారు కేసీఆర్! ఇప్పటికే తొమ్మిది వేల కొత్త పెన్షన్లకు అనుమతులను జారీ చేసిన టీఆర్ఎస్ తెల్లరేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది.
ప్రగతి భవన్ నుంచి సమీక్షిస్తున్న కేసీఆర్ ప్లాన్ ఏమేరకు వర్కౌట్ అవుతుందో.. తమ బలగాలను మొత్తం దుబ్బాకలో దించిన విపక్షాల వ్యూహాలకు ఎలా చెక్ చెబుతారో చూడాలి.











