ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండున్నరేళ్లకు తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తానని ముందే జగన్ చెప్పిన సంగతి తెలిసిందే.
2019, ఎన్నికలలో వైసీపీ రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని సాధించింది. 175 స్థానాలకు గాను ఏకంగా వైసీపీ 151 స్థానాలను సొంతం చేసుకుంది. దీంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జగన్ తన మంత్రివర్గాన్ని సామాజిక సమీకరణాలతో భర్తీ చేశారు. మంత్రివర్గంలో చోటుదక్కని వారికి మరో రెండున్నరేళ్లకు తన మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరిస్తానని అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.
మంచి పనితనం చూపిన వారిని కొనసాగిస్తామని జగన్ చెప్పినా చాలా మంది మంత్రులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అధికార కార్యక్రమాలకు దూరంగా ఉండటం, అవినీతి వ్యవహారాలలో తలదూర్చడం లాంటి పనులలో కొంతమంది మంత్రులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయా మంత్రులపై వేటు తప్పదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలో జగన్ చెప్పిన రెండున్నరేళ్ల గడువు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై చర్చ జరుగుతోంది.
ఉత్తరాంధ్రలో మార్పులు
శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్ ఒక్కరే మంత్రిగా కొనసాగనున్నారని తెలుస్తోంది. సీదరి అప్పలరాజు స్థానంలో తమ్మినేని సీతారాం మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. తమ్మినేని సీతారాం మంత్రివర్గంలో చోటు దక్కడంతో స్పీకర్ పదవి ఖాళీ కానుంది. ధర్మాన ప్రసాద రావుకు స్పీకర్ పదవి దక్కే ఆస్కారం ఉందని సమాచారం. విజయనగరం నుంచి బొత్సను మాత్రమే కొనసాగిస్తూ శ్రీవాణిని తొలగించనున్నారని తెలుస్తోంది. కోలగట్ల వీరభద్ర స్వామిని మంత్రివర్గంలో తీసుకోనున్నట్లు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
వైజాగ్ నుంచి అవంతి శ్రీనివాసరావుకి ఉద్వాసన తప్పకపోవచ్చని సమాచారం. ఆయన స్థానంలో గుడివాడ అమర్నాథ్ కు మంత్రివర్గంలో చోటు దక్కనుందని వార్తలు వినబడుతున్నాయి. గొల్ల బాబురావు లేదా కరణం ధర్మశ్రీలలో ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఉభయ గోదావరి జిల్లా ప్రక్షాళన
గోదావరి జిల్లాల నుంచి పినిపే విశ్వరూప్, తానేటి వనిత, శ్రీరంగనాథరాజులకు ఉద్వాసన తప్పదన్నట్లు సమాచారం. దాడిశెట్టి రాజా, తెల్లం బలరాజు, అబ్బయ్య చౌదరిలకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. కన్నబాబు, వేణుగోపాల కృష్ణలకు మాత్రమే పొడిగింపు ఉండనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.
నాని అవుట్…
కృష్ణ జిల్లా నుంచి కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ లపై వేటు తప్పదని సమాచారం. నాని స్థానంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మంత్రిగా ప్రమోషన్ పొందనున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో నాని చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. దీంతో నాని వేగానికి చెక్ పెట్టాలని వైసీపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో వెల్లంపల్లిపై వేటువేసి అదే సామాజిక వర్గానికి చెందిన విజయనగరం ఎమ్మెల్యే వీరభద్ర స్వామికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొలను పార్థసారధి కొత్తగా మంత్రి కానున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. పేర్ని నాని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
గుంటూరులో పెను మార్పులు
గుంటూరు జిల్లా నుంచి సుచరితను కొనసాగిస్తూ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. అంబటి రాంబాబు, విడుదల రజనీ, మేరుగ నాగార్జునలు మంత్రివర్గ జాబితాలో ముందంజలో ఉన్నారు. ఆర్కే, పిన్నెల్లి, మర్రిలకు ఈసారి కూడా ఆశాభంగం కలగక తప్పదని వార్తలు వినబడుతున్నాయి. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ గానే కొనసాగించేలా వైసీపీ పెద్దలు నిర్ణయానికి వచ్చారని సమాచారం.
ప్రకాశం నో చేంజెస్
ప్రకాశం జిల్లా నుంచి మాత్రం మంత్రివర్గంలో ఎటువంటి మార్పులు లేవని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి బాలినేని, ఆదిమూలపు సురేష్ వైసీపీతోనే ఉన్నారు. అందుకే వారినే మంత్రులుగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మానుగుంట మహీధర్ రెడ్డి, జూపూడి ప్రభాకర రావు లాంటి సీనియర్లు ఉన్నా వైసీపీ పెద్దలు అస్మదీయులనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినబడుతున్నాయి.
నెల్లూరు ఇద్దరిపై వేటు
వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. వీరి స్థానాలలో కాకాణి గోవర్ధన్ రెడ్డి, వరప్రసాద్ లను తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. ఒకవేళ నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాల రీత్యా మార్పులు చేయవలసి వస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డికి బదులుగా ఆనం రామనారాయణ రెడ్డికి స్థానం దక్కే అవకాశం ఉంది.
చిత్తూరు కష్టమే
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి మరోమారు రెన్యూవల్ రానుంది. ఆయనను మార్చే అవకాశమే లేనట్లు సమాచారం అందుతోంది. నారాయణ స్వామికి ఉద్వాసన తప్పదని ఇన్సైడ్ వర్గాల టాక్. ఎంఎస్ బాబులకు స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం గట్టిగానే ఆశలు పెట్టుకున్న రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకరణ్ రెడ్డిలకు ఈ సారి కూడా అవకాశం లభించదని వార్తలు వినబడ్డాయి. ఇప్పటికే రోజాకు ఎపిక్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించగా, భాస్కర్ రెడ్డికి తుడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. కరుణాకరణ్ రెడ్డికి కూడా ఓ కీలక పదవి అప్పగించనున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
సొంత జిల్లాలో మార్పులు
కడప జిల్లాలో డిప్యూటీ సీఎంగా ఉన్న అహమ్మద్ భాషపై వేటు ఖాయమని తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్సీగా విజయం సాధించిన జకియా అలీ ఖాన్ కు స్థానం దక్కనుంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ కు ఎస్సీ కోటాలో మంత్రి వర్గంలో స్థానం దక్కనున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. శ్రీకాంత్ రెడ్డి కూడా విప్ పదవి నుంచి తప్పుకోనున్నారని తెలుస్తోంది.
అనంతపురం జిల్లా ఏకైక మంత్రి టార్గెట్
అనంతపురం జిల్లాలో శంకర నారాయణపై వేటు వేయనున్నారని వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని శంకర నారాయణపై వైసీపీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. దీంతో శంకర నారాయణపై వేటు వేయడం ఖాయమని తెలుస్తోంది. ఆయన స్థానంలో అనంత వెంకటరామిరెడ్డి స్థానం దక్కించుకోనున్నారని తెలుస్తోంది. మంత్రివర్గ స్థానం కోసం పోటీపడుతున్న ప్రకాష్ రెడ్డికి ఇప్పటికే ప్రభుత్వ పనులను అప్పగించినట్లు సమాచారం.
కర్నూలు రాజకీయమే వేరబ్బా
కర్నూలు జిల్లాలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మడి జయరాం జగన్ క్యాబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఈసారి గుమ్మడి జయరాంపై వేటు పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. పేకాట క్లబ్, బెంజి కారు వివాదం, భూ కబ్జాలలో జయరాం పేరు వినబడిన సంగతి తెలిసిందే. దీంతో జయరాంని తొలగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న బుగ్గనకు 2.0లో కూడా చోటు ఉందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
గుమ్మడి జయరాం స్థానంలో డాక్టర్ సుధాకర్ స్థానం దక్కించుకోనున్నారని వైసీపీ వర్గాల సమాచారం. వైసీపీ పార్టీలోనే అత్యంత సీనియర్ నాయకుడిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం ఆశలు పెట్టుకున్నారు. సామాజిక సమీకరణాలు దృష్ట్యా ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చు. దీంతో ఆయనకు విప్ పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మొత్తంమీద జగన్ టీమ్ 2.0లో కూడా సామాజిక సమీకరణాలపై పూర్తిగా దృష్టిపెట్టారని అర్ధమవుతోంది. ఆవిర్బావం నుంచి పార్టీ కోసం పని చేసిన వారికి మాత్రం మంత్రి పదవులు దక్కలేదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.











