విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమాలో నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమాతో పాటు వెంకీ ‘ఎఫ్ 3’ లో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఇప్పుడు వెంకీ ‘లక్కీ కీ’ రీమేక్ లో నటించేందుకు ఓకే చెప్పాడని తెలిసింది. కొరియన్ మూవీ అయిన లక్కీ కీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ దక్కించుకున్నాయి. ఈ రెండు నిర్మాణ సంస్థలు గతంలో కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ ని తెలుగులో ‘ఓ బేబీ’ పేరుతో రీమేక్ చేశారు. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఓ బేబీ చిత్రాన్ని నందినీ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇప్పుడు కొరియన్ మూవీ ‘లక్కీ కీ’ ని కూడా సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం. అయితే.. ఈ సినిమాలో నటించేది ఎవరు అనేది ప్రకటించలేదు కానీ.. వెంకటేష్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారని తెలిసింది. ప్రచారంలో ఉన్నట్టుగా వెంకీ నటిస్తారా..? లేక వేరే హీరో నటిస్తారా.. ? అనేది తెలియాల్సివుంది.











