ఏడునెలలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ షూటింగ్స్ జరుపుకోక.. థియేటర్స్ తెరిచే పరిస్థితుల్లేక తెగ అవస్థలు పడుతోంది. అయితే.. ఇప్పుడిప్పుడే సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. పలు చిత్రాలు తిరిగి షూటింగ్స్ కు వెళుతున్నాయి. అగ్ర కథానాయికుల సినిమాలు కూడా వరుసగా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నాయి. అంతలోనే.. కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ యాజమాన్యానికి, నిర్మాతలకు నోరు తీపి చేసే శుభవార్త చెప్పింది. అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ ను తెరుచుకోవచ్చని. ఈ పరిస్థితుల్లో ఏవో చిన్న చిన్న సినిమాలు తప్పితే.. పేరున్న సినిమాలు థియేటర్స్ లోనే విడుదలవ్వాలి లెక్క ప్రకారం. అయితే ఓ మలయాళ సినిమా మాత్రం అదే రోజు ఓటీటీలో విడుదలవడానికి సిద్ధపడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సినిమా పేరు ‘హలాల్ లవ్ స్టోరీ’. సినిమా తీయాలనే కలను నిజం చేసుకొనే ప్రాసెస్ లో కొందరు యువకులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటనేది ఈ సినిమా కథాంశం.
మాలీవుడ్ లో అగ్ర నటీనటులందరూ అభినయిస్తున్నారు ‘హలాల్ లవ్ స్టోరీ’ సినిమాలో. థియేటర్స్ లో విడుదలయ్యేంత విషయముంది ఇందులో. అలాంటప్పుడు దీన్ని ఓటీటీలో ఎందుకు విడుదల చేస్తున్నారనే సందేహాలు సాధారణంగానే తలెత్తుతాయి. అయితే దీనికి ఒకటే కారణం చెబుతున్నారు సినిమా మేకర్స్. ఆరోజు థియేటర్స్ తెరిచినా.. 50 శాతం ఆక్యుపెన్సీనే ఉండడంతో.. దాని ప్రభావం కలెక్షన్స్ మీద తీవ్రంగా చూపిస్తుందనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నానంటున్నారు నిర్మాతలు. పృధ్విరాజ్ సుకుమారన్ అన్నయ్య ఇంద్రజిత్ సుకుమారన్ హీరోగా.. గ్రేస్ ఆంటోనీ పార్వతీ మీనన్, జోజు జార్జ్ , మాముకోయ, షరాఫుద్దీన్, సౌబిన్ షాహిర్ నటించిన ఈ సినిమాను సకరియా మొహమ్మద్ డైరెక్ట్ చేస్తున్నాడు. మరి అక్టోబర్ 15న అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోన్న ‘హలాల్ లవ్ స్టోరీ’ థియేటర్స్ లోని ఏ సినిమాతో పోటీ పడుతుందో చూడాలి.











